Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ప్రధాని మోడీపై సంచలన కామెంట్స్ చేసిన మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్!

ప్రధాని మోడీపై సంచలన కామెంట్స్ చేసిన మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్!
-మోదీకి మతి తప్పిందని అమిత్ షా అన్నారు.. మేఘాలయ గవర్నర్ సంచలన వ్యాఖ్యలు..
-రైతులు ఏమైనా నా కోసం చనిపోయారా? అని మోదీ ప్రశ్నించారు
-ఆయనకు అహంకారం ఎక్కువన్న సత్యపాల్ మాలిక్
-వీడియో వైరల్.. రాజకీయ ప్రకంపనలు
-తన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చుకునే ప్రయత్నం

ప్రధానమంత్రి నరేంద్రమోదీపై మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. హర్యానాలోని చర్ఖీలో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో సత్యపాల్ మాట్లాడుతూ.. మూడు సాగుచట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతుల విషయమై చర్చించేందుకు ఇటీవల తాను మోదీతో సమావేశమయ్యానని తెలిపారు. ఈ సందర్భంగా రైతుల మరణాలపై మోదీ అహంకారంగా మాట్లాడారని అన్నారు.

ప్రధానితో భేటీ అయిన ఐదు నిమిషాలకే తమ మధ్య వాగ్వివాదం మొదలైందని అన్నారు. ఆందోళనల్లో 500 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారని తాను ఆయన దృష్టికి తీసుకెళ్తూ.. కుక్క చనిపోయినా సంతాపం తెలుపుతారు కదా, మరి రైతుల మరణాలను ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించానని పేర్కొన్నారు. దానికి మోదీ.. ‘‘వారేమైనా నా కోసం చనిపోయారా?’’ అని అహంకారంగా సమాధానమిచ్చారని గుర్తు చేశారు. అప్పుడు తాను ‘‘అవును.. మీరే పాలకులు కాబట్టి’’ అని సమాధానమిచ్చానని చెప్పుకొచ్చారు.

చివరికి ఆ సమావేశం వాగ్వివాదంతోనే ముగిసిందని పేర్కొన్నారు. తర్వాత అమిత్ షాను కలవమని చెప్పారని పేర్కొన్న మాలిక్.. ఆయనతో జరిగిన సమావేశంలో ఏం జరిగిందో కూడా వెల్లడించారు. షా తనతో మాట్లాడుతూ.. ‘‘ఆయన(మోదీ)కు మతి తప్పింది. కొందరు ఆయనను తప్పుదారి పట్టిస్తున్నారు. ఏదో ఒక రోజు ఆయనకు వాస్తవం అర్థమవుతుంది. మీరు మాత్రం ఇవేమీ పట్టించుకోకండి. మమ్మల్ని కలుస్తూ ఉండండి’’ అని తనతో చెప్పారని వివరించారు.

సత్యపాల్ చేసిన ఈ వ్యాఖ్యల వీడియో తాజాగా వెలుగులోకి వచ్చి రాజకీయంగా ప్రకంపనలు సృష్టించడంతో తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చుకున్నారు. రైతుల సమస్యలపై తాను చెప్పేది వినేందుకు మోదీ ఇష్టపడక అమిత్ షాను కలవమన్నారని అన్నారు. మోదీ అంటే అమిత్ షాకు చాలా గౌరవమని పేర్కొన్నారు. మోదీపై చెడుగా షా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని, రైతులపై తన ఆందోళన అర్థమైందని మాత్రమే ఆయన చెప్పారని గవర్నర్ మాలిక్ చెప్పుకొచ్చారు.

Related posts

బద్ధ శత్రువులుగా ఉన్నోళ్లే కాంగ్రెస్‌లో చేరారు.. షర్మిల వస్తే తప్పేంటి?: భట్టి విక్రమార్క ఆసక్తికర వ్యాఖ్యలు….

Drukpadam

బహుజనులు బానిసలుగా కాకుండా పాలకులుగా మారాలి : ప్రవీణ్ కుమార్!

Drukpadam

చెప్పేది వినని సభ్యుడికి నేను ఎలా బదులిచ్చేది?: రాహుల్ ప్రశ్నలపై మోదీ స్పందన!

Drukpadam

Leave a Comment