ఏకంగా 17 నిమిషాల పాటు ప్రజ్వరిల్లిన చైనా కృత్రిమ సూర్యుడు… కొత్త రికార్డు నమోదు
- టోకోమాక్ రియాక్టర్ ను మరోసారి మండించిన చైనా
- 7 కోట్ల డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉత్పత్తి
- గతంలో 1.6 నిమిషాల పాటు మండిన చైనా సూర్యుడు
భూమిపై జీవానికి సూర్యుడే ఆధారం. సౌరశక్తిని ఉపయోగించుకుని మానవులు, జంతు, వృక్ష జాతులు మనుగడ సాగిస్తున్నాయి. సూర్యుడు లేని ప్రపంచాన్ని ఏమాత్రం ఊహించలేం. అయితే, సూర్యుడి శక్తిని భూమ్మీదే ఉత్పత్తి చేసేందుకు చైనా కొన్నాళ్ల కిందట బృహత్తర యజ్ఞం అనదగ్గ పరిశోధన చేపట్టింది. ఎక్స్ పెరిమెంటల్ అడ్వాన్స్ డ్ సూపర్ కండక్టింగ్ టోకామక్ (ఈఏఎస్టీ) పేరిట చైనా అకాడమీ ఆఫ్ సైన్సెస్ కృత్రిమ సూర్యుడ్ని తయారుచేసింది. ఇందులోని టోకోమాక్ రియాక్టర్ అచ్చం సూర్యుడి తరహాలోనే పనిచేస్తుంది.
తాజాగా ఇది ఏకంగా 17.6 నిమిషాల పాటు శక్తిని ఉత్పాదన చేసింది. 1056 సెకన్లలో 7 కోట్ల డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను ఉత్పత్తి చేసింది. సూర్యుడి ఉష్ణోగ్రత 1.5 కోట్ల డిగ్రీల సెల్సియస్ కాగా… చైనా కృత్రిమ సూర్యుడు అంతకంటే ఎక్కువ వేడిని ఉత్పత్తి చేయడం విశేషం. గతేడాది మేలో 1.6 నిమిషాల పాటు కృత్రిమ సూర్యుడ్ని మండించింది. ఇప్పుడా రికార్డు తెరమరుగైంది.
ఇందులో ప్రధానంగా డ్యుటేరియం పదార్థాన్ని అణు విచ్ఛిత్తి విధానంలో మండించి అమితమైన శక్తిని ఉత్పత్తి చేస్తారు. ఇందుకోసం చైనా అకాడమీ ఆఫ్ సైన్సెస్ లో ఫ్యూజన్ ఎనర్జీ పరికరం ఉంది. దీన్నే కృత్రిమ సూర్యుడు అని పిలుస్తుంటారు. భవిష్యత్తులో దీని సాయంతో శక్తిని ఉత్పాదన చేసి దేశీయ అవసరాలకు వినియోగించుకోవడం చైనా లక్ష్యం.