ఏపీలో నైట్ కర్ఫ్యూ.. ఆదేశాలు జారీ చేసిన సీఎం జగన్
ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు
రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ
మాస్కులు పెట్టుకోని వారికి భారీ జరిమానా విధించాలన్న సీఎం
కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా నైట్ కర్ఫ్యూని విధించింది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు రాత్రి పూట కర్ఫ్యూని విధించింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితి, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఈరోజు ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ అవసరమైన మందులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కరోనా బాధితులకు ఇచ్చే హోంకిట్లలో మార్పులు చేయాలని చెప్పారు. అన్ని నియోజకవర్గాల్లో కోవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మాస్క్ పెట్టుకోని వారికి భారీ జరిమానా విధించాలని ఆదేశించారు. బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులు కూడా మాస్కులు ధరించాలని చెప్పారు.
కోవిడ్ నిబంధలను ప్రతి ఒక్కరూ కచ్చితంగా పాటించేలా చూడాలని జగన్ చెప్పారు. 104 కాల్ సెంటర్ ను బలోపేతం చేయాలని సూచించారు. థియేటర్లలో 50 శాతం మంది ప్రేక్షకులను మాత్రమే అనుమతించాలని ఆదేశించారు. సీటు మార్చి సీటుకు అనుమతించాలని చెప్పారు. బహిరంగ కార్యక్రమాల్లో 200 మందికి, ఇండోర్ కార్యక్రమాల్లో 100 మందికి మించి అనుమతించకూడదని ఆదేశించారు.
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కార్యాలయంలో 90 శాతం మంది సిబ్బందికి కరోనా
k
ముగ్గుల పోటీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కిషన్‌రెడ్డి
లక్షణాలు లేవని నిర్లక్ష్యంగా ఉండొద్దన్న కేంద్రమంత్రి
15-18 ఏళ్లలోపు పిల్లలందరికీ తల్లిదండ్రులు టీకాలు వేయించాలని సూచన
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కార్యాలయంలోని 90 శాతం మంది సిబ్బంది కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా నిన్న హైదరాబాద్ నారాయణగూడలోని కేశవ స్మారక విద్యా సంస్థల క్రీడా మైదానంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కిషన్‌రెడ్డి విజేతలకు బహుమతులు అందించారు.
అనంతరం మాట్లాడుతూ.. తన కార్యాలయంలోని 90 శాతం మంది అధికారులు, సిబ్బంది కరోనా బారినపడినట్టు చెప్పారు. లక్షణాలు లేవని నిర్లక్ష్యంగా ఉండొద్దని ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. 15-18 ఏళ్ల లోపు పిల్లలకు తల్లిదండ్రులు తప్పనిసరిగా టీకాలు ఇప్పించాలన్నారు. దేశభక్తి, జాతీయ భావం ఉట్టిపడేలా ముగ్గులు వేసినవారు వాటి వద్ద ఫొటోలు తీసుకుని ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తే ధ్రువీకరణ పత్రం వస్తుందని కేంద్రమంత్రి తెలిపారు.
తెలంగాణలో ఈ నెల 20 వరకు కొవిడ్ ఆంక్షల పొడిగింపు
ర్యాలీలు, మతపరమైన కార్యమాలపై నిషేధం
శరీర ఉష్ణోగ్రతను చెక్ చేశాకే లోపలికి అనుమతించాలని ఆదేశం
రాష్ట్రంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే ఉన్న ఆంక్షలను ఈ నెల 20వ తేదీ వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఒమిక్రాన్ వేరియంట్ నేపథ్యంలో గత నెల 25న ప్రభుత్వం ఆంక్షలు విధించింది. నేటితో ఆంక్షల గడువు ముగియనున్న నేపథ్యంలో ఈ నెల 25 వరకు వీటిని పెంచుతూ నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. బహిరంగ సభలు, ర్యాలీలు, మతపరమైన కార్యక్రమాలతోపాటు రాజకీయ, సాంస్కృతిక కార్యక్రమాలపై నిషేధం కొనసాగుతుందని ఉత్తర్వుల్లో పేర్కొంది.
ప్రజా రవాణా, దుకాణాలు, మాల్స్, వ్యాపార సంస్థలు, కార్యాలయాల్లో ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని సూచించింది. శరీర ఉష్ణోగ్రతలను చెక్ చేసిన తర్వాతే లోపలికి అనుమతించాలని పేర్కొంది. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించని వారిపై చర్యలు ఉంటాయని హెచ్చరించింది.