Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

మోడీ ప్రధాని పదవిని దిగజార్చారు: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ధ్వజం!

మోడీ ప్రధాని పదవిని దిగజార్చారు: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ధ్వజం!
-దళిత సీఎంను నవ్వులపాలు చేయాలని బీజేపీ కుట్ర
-124 జిఓ ఆమోదించినప్పుడు గాడిదలు కాశారా?
-శాంతి భద్రతల కోసం గవర్నర్, డీజీపీలను కలుస్తాం
-మిర్చి పంట పరిశీలనకు సిఎల్పీ బృందం
-Go 124, 317లను రద్దు చేయాలని కేంద్రానికి లేఖ రాస్తాం

దేశంలో అత్యున్నత పదవిలో ఉన్న మోడీ పంజాబ్ లో చేసిన డ్రామాతో తన పిఎం పదవిని దిగజార్చారని తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. ఆదివారం అసెంబ్లీ ప్రాంగణంలోని సీఎల్పీ కార్యాలయంలో తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత భట్టి విక్రమార్క అధ్యక్షతన సీఎల్పీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి , ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పోడెం వీరయ్యలు హాజరయ్యారు. అనంతరం మీడియా పాయింట్ వద్ద ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో భట్టి విక్రమార్క వారితో కలిసి మాట్లాడారు. పంజాబ్ లో మోడీ హాజరు కావలసిన బహిరంగ సభకు జనాలు రాకపోవడంతో మార్గమధ్యం నుంచి వెనుదిరిగి వెళ్ళినా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తనకు సరైన భద్రత ఇవ్వలేదని పంజాబ్ కాంగ్రెస్ ప్రభుత్వం పై నెపం మోపడాన్ని సీఎల్పీ బృందం తీవ్రంగా ఖండిస్తున్నట్టు ప్రకటించారు.
పంజాబ్ ప్రభుత్వం మీద కక్షసాధింపులో భాగంగా ప్రజల దృష్టిలో ఆ ప్రభుత్వాన్ని తప్పుగా చిత్రీకరించేందుకు, దళిత సీఎం ఫెయిల్ అయినట్లు‌, పంజాబ్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నవ్వులపాలు చేయాలని, ప్రధానికి భద్రత కల్పించలేదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయడానికి బిజెపి జాతీయస్థాయిలో కుట్ర చేస్తున్నదని మండిపడ్డారు. గత ప్రధానులు మోడీ మాదిరిగా ఇంత దిగజారుడుగా వ్యవహరించలేదని ఎద్దేవా చేశారు.
గతంలో ఒరిస్సాలో జరిగిన బహిరంగ సభలో స్వర్గీయ ప్రధాని ఇందిరాగాంధీ మీద రాయితో దాడి జరుగగా, తలకు బలమైన గాయమై రక్తం కారుతున్న చలించకుండా తన ఉపన్యాసాన్ని పూర్తిచేసిందని గుర్తు చేశారు. ఆ నాటి ఒరిస్సా ప్రభుత్వం పైన ఇందిరాగాంధీ కానీ, కాంగ్రెస్ పార్టీ నిందలు వేయలేదన్నారు.ఆ ఘటన పైన ప్రధాని ఇందిరాగాంధీ చాలా హుందాతనం గా వ్యవహరించి తన పదవికి వన్నె తీసుకు వచ్చారని పేర్కొన్నారు. కానీ మోడీ దిగజారుడు ప్రకటనలతో ప్రధాని పదవిని దిగజార్చారని ధ్వజ మెత్తారు.
పీఎంకి వత్తాసుగా పంజాబ్ లో రాష్ట్రపతి పాలన పెట్టాలని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్, బీజేపీ నేతలు ఆడుతున్న డ్రామాలు ఆపాలన్నారు.

అప్పుడు గాడిదలు కాశారా..?
371(డి)కి భిన్నంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 124 రాష్ట్రపతి ఆమోదం కంటే ముందు కేంద్ర హోం శాఖతో ఎందుకు సమీక్ష కోరలేదని బిజెపి రాష్ట్ర నాయకులను ప్రశ్నించారు. ఇప్పుడు దీక్షల పేరిట డ్రామాలు చేస్తున్న బిజెపి నాయకులు అప్పుడు నిద్రపోయారా? లేక గాడిదలు కాశారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 124 జీవోను ఆమోదించిన బిజెపి పాలకులు రాజకీయ లబ్ది కోసం ఇప్పుడు 317 జీవో తో జరుగుతున్న ఉద్యోగుల బదిలీలపై దొంగ దీక్షలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రమే స్థానికత సమస్యతో ఏర్పడిందన్నారు. స్థానికతను పాతర పెట్టి 3.50 లక్షల మంది ఉద్యోగుల జీవితాలతో చెలగాటమాడే విధంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 317తో రాష్ట్రంలో గందరగోళం ఏర్పడిందన్నారు. 371డి ని జీవోలు 124, 317 చంపేసిందని వివరించారు.
371డి కి భిన్నంగా ఉన్న ఈ జీవోలను రద్దు చేయాలని సీఎల్పీ బృందం కేంద్ర హోం శాఖకు లేఖ రాస్తామని చెప్పారు.

గవర్నర్, డిజిపిలను కలుస్తాం
పోలీసులను trs ప్రభుత్వం తమ క్యాడర్ గా మార్చుకుందని, పోలీసులను వాళ్ళ ఉద్యోగాలు చేయనియ్యడం లేదని,
పోలీసులను.పోలీసు పనులు చేసుకొనివ్వండి అని గవర్నర్ , డీజీపీలను సీఎల్పీ బృందం కలుస్తుందని వెల్లడించారు. రాష్ట్రంలో క్షీణిస్తున్న శాంతిభద్రతల వైఫల్యాలపై ఆందోళన వ్యక్తం చేశారు. వనమా రాఘవ అరాచకాలకు రామకృష్ణ కుటుంబం బలి కాగా, పోలీసులు రక్షణ ఇవ్వకపోవడం వల్లనే మంథని లో పట్టపగలు నడిరోడ్డుపైన న్యాయవాది వామనరావు హత్యకు గురయ్యాడని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలతో రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. కింది స్థాయి పోలీసు అధికార యంత్రాంగాన్ని రాఘవ తన గుప్పిట్లో పెట్టుకున్నాడని తెలిపారు.
పోలీసుల వద్ద రక్షణ లభించక, రాఘవ అరాచకాలకు తాళలేక రామకృష్ణ కుటుంబం బలైందని ఆవేదన వ్యక్తం చేశారు. పాల్వంచ ఘటనపై టిఆర్ఎస్ నుంచి వనమా రాఘవను సస్పెండ్ చేస్తే సరిపోదని , రాఘవ తండ్రి వనమా వెంకటేశ్వరరావును కూడా టిఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేసి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించాలని సీఎం కేసీఆర్ ను డిమాండ్ చేశారు.

మిర్చి పంటల పరిశీలనకు సీఎల్పీ బృందం

మిర్చి పంటను…తామర, పత్తి పంటను గులాబీ పురుగు నాశనం చేస్తున్నట్టే ప్రజా సంపదను తామరపువ్వు, గులాబీ పార్టీల పాలకులు డొల్ల చేస్తున్నారని విమర్శించారు. దాన్యం కొనుగోలు పేరిట బీజేపీ , టీఆర్ఎస్ చేసిన రాజకీయం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని పేర్కొన్నారు. యాసంగి వరి ధాన్యాన్ని రాష్ట్రం కొనుగోలు చేయాల్సిందేనని అన్నారు. తెగుళ్లతో నష్టపోయిన పత్తి, మిర్చి, పసుపు రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం వెంటనే వ్యవసాయ పొలాల వద్దకు అధికారులను పంపించి పంట నష్టం అంచనా వేసి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. మిర్చి రైతులకు భరోసా కల్పించడానికి త్వరలోనే సీఎల్పీ బృందం రాష్ట్ర వ్యాప్తంగా మిర్చి తోటల పరిశీలనకు వెళ్తుందని ప్రకటించారు.

రైతులను మోసం చేసినందుకే సంబరాలా…?
రైతు బంధు సంబరాల పేరుతో టిఆర్ఎస్ ప్రభుత్వం రైతులను వంచిస్తున్నదని విమర్శించారు. టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతులకు రుణమాఫీ, పంట నష్టపరిహారం, యంత్ర పనిముట్లపై సబ్సిడీ, ఉద్యానవన పంటలకు రాయితీలు బంద్ చేసినందుకేనా..? టిఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు సంబరాలు నిర్వహిస్తున్నదని ఎద్దేవా చేశారు. ధాన్యం కొనుగోలులో తరుగు పేరిట క్వింటాకు ఐదారు కిలోలు కట్ చేసి రైతులు ఎకరాకు పది వేల చొప్పున నష్ట పోయే విధంగా మిల్లర్లకు సహకరించిన టిఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా రైతు పక్షపాతి అవుతుందని ప్రశ్నించారు. ఎకరాకు 5 వేల పెట్టుబడి ఇచ్చి సంబరాలు చేయడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. కాంగ్రెస్ నాయకులు అంతర్గత సమావేశాలు నిర్వహించుకోవడానికి కొవిడ్ నిబంధనలు అడ్డు వస్తున్నాయని అనుమతి ఇవ్వని ప్రభుత్వం రైతుబంధు సంబరాలు ఎట్లా నిర్వహిస్తారని ప్రశ్నించారు. రైతుబంధు సంబరాలు నిర్వహిస్తే కోవిడ్ వ్యాప్తి జరగదా అని ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రతిపక్షాలకు కోవిడ్ నిబంధనలు, మీకు మాత్రం సంబరాలు ఇదేం న్యాయమని సర్కారుపై నిప్పులు చెరిగారు. ఇప్పటికే గ్యాస్,పెట్రోలు, డీజిల్, నిత్యవసర వస్తువుల ధరలు పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచాలని ప్రతిపాదనలు సిద్ధం చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. విద్యుత్ ఛార్జీలు పెంచితే ఊరుకోమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

Related posts

ఖమ్మం మేయర్ గా సీల్డ్ కవర్ లో పేరెవరిది ?

Drukpadam

హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ ?

Drukpadam

మీ ప్రతాపం… దమ్ముంటే నాపై చూపండి: వైసీపీ నేతలపై జనసేనాని ఫైర్

Drukpadam

Leave a Comment