ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అరెస్టును ఖండించిన భట్టి విక్రమార్క!
టిఆర్ఎస్ ప్రభుత్వం అనాలోచితంగా తీసుకువచ్చిన 317 జీవో కారణంగా ఉద్యోగం బదిలీ కావడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్న బీంగల్ కు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు పోలసాని సరస్వతి కుటుంబాన్ని పరామర్శించడానికి సోమవారం వెళుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని కమ్మర్ పల్లి మండలం హాసకొత్తూర్ వద్ద పోలీసులు అడ్డుకుని, అక్రమంగా అరెస్టు చేయడాన్ని తెలంగాణ కాంగ్రెస్ శాసనసభపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క తీవ్రంగా ఖండించారు. ఆత్మహత్యకు పాల్పడిన సరస్వతి అంత్యక్రియల్లో పాల్గొని, బాధిత కుటుంబాన్ని పరామర్శించి, వారికి ధైర్యం చెప్పడానికి వెళ్తున్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కారును పోలీసులు చేజింగ్ చేసి మరి అడ్డుకోవడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. బాధిత కుటుంబాలను పరామర్శించి ధైర్యం చెప్పడం ప్రజాస్వామ్యంలో నేరమా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై స్పందించే ప్రతిపక్ష నేతలను ప్రభుత్వం పోలీసుల చేత అణగదొక్కాలని చూస్తుందని విమర్శించారు. ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలని ప్రజలు ప్రజాస్వామ్య వాదులు అర్థం చేసుకోవాలని భట్టి కోరారు .