రాజీనామా దిశగా రఘురామ జనసేన లో చేరే అవకాశం…?
నరసాపురం ప్రజలు నన్ను మళ్లీ గెలిపించాలి: రఘురామకృష్ణరాజు
క్షవరం అయిందన్న సంగతి ఓటర్లకు ఇన్నాళ్లకు తెలిసిందన్న రఘురాజు
తనను స్ఫూర్తిగా తీసుకుని పోరాడాలని పిలుపు
నియోజకవర్గంలో దర్శనమిస్తున్న ఆసక్తికరమైన ఫ్లెక్సీలు
మరికొద్ది రోజుల్లో ఎంపీ పదవికి రాజీనామా
ఇప్పటి నుంచే నియోజకర్గంలో పర్యటించే అవకాశం
సంక్రాంతికి నరసాపురం లో పర్యటనకు ఏర్పాట్లు
నియోజకవర్గంలో వెలసిన పోస్టర్లు
- వివాద స్పద ఎంపీగా పేరుబడ్డ రఘురామకృష్ణమ రాజు రాజీనామాకు సిద్ధపడ్డారు . దాదాపు మరికొద్ది రోజుల్లో ఆయన రాజీనామా ఖాయంగా కనిపిస్తుంది. అందుకు ఆయన మాటలే నిదర్శనం …అయితే ఆయన తిరిగి నరసాపురం నుంచి పోటీచేయాలని భావిస్తున్నారు .అందుకు ఏపార్టీలో చేరితే బాగుంటుందని ఆలోచించి జనసేన వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది. బీజేపీ లో చేరాలని ఆయన అనుకున్నప్పటికీ బీజేపీ అధిష్టానం అందుకు అంగీకరించలేదని ,ఇప్పుడు వైసీపీ తో ఉన్న సంబంధాల రీత్యా రఘురామ ను చేర్చుకుంటే తప్పుడు సంకేతాలు పోతాయని బీజేపీ భావించి ఉండవచ్చు . ఇక టీడీపీ లో చేరితే మరిన్ని ఇబ్బందులు కొని తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. ఇక జనసేన లో చేరితే బీజేపీ జనసేన పొత్తు ఉన్నందున తన ప్రచారానికి తేలిక అవుతుందని రఘురామ భావిస్తున్నారని తెలుస్తుంది.గత రెండు సంవత్సరాలకు పైగా వైసీపీ తో తెగతెంపులు చేసుకొని ఆపార్టీని లక్ష్యం గా విమర్శలు గుప్పిస్తున్నారు . ప్రత్యేకించి సీఎం జగన్ కు వ్యతిరేకంగా ఆయన మాట్లాడటం పై విమర్శలు ఉన్నాయి. దీంతో ఆయన లోకసభ సభ్యుడుగా లేకుండా చేయాలనీ భావించిన వైసీపీ స్పీకర్ దగ్గర అనర్హత కోసం ఫిర్యాదు చేసింది. చివరకు స్పీకర్ ఒత్తిడి పని చేసిందా లేక రాజకీయ స్ట్రాటజీ ప్రకారం వెళుతున్నారో తెలియదు కానీ రాజీనామాకు సిద్ధపడ్డారు .
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు రాజీనామాకు దాదాపు సిద్ధమైనట్టే కనిపిస్తోంది. ఆయన ఇప్పుడు ఉప ఎన్నిక గురించే మాట్లాడుతున్నారు. నరసాపురం నియోజకవర్గ ప్రజలు మరోసారి తనకు మద్దతుగా నిలవాలని, ఉప ఎన్నికలో గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో సర్కారుకు వ్యతిరేకంగా ఏదైనా మాట్లాడాలంటే భయపడిపోయేంతగా పరిస్థితులు ఉన్నాయని అన్నారు.
క్షవరం అయిందన్న సంగతి ఓటర్లకు ఇన్నాళ్లకు తెలిసిందని, క్షవరం అయితే తప్ప వివరం రాదనేలా ఉద్యోగ సంఘాల పరిస్థితి ఉందని రఘురామ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఉన్న పీఆర్సీ కొనసాగితే చాలని ఉద్యోగులు భావిస్తున్నారని వివరించారు. తనను స్ఫూర్తిగా తీసుకుని ప్రజలు పోరాడాలని రఘురామ పిలుపునిచ్చారు.
కాగా, రఘురామ నరసాపురం వస్తున్నానని ఇంతకుముందు ప్రకటించిన నేపథ్యంలో నియోజకవర్గంలో ఆసక్తికరమైన ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. అందులో ఓ వైపు రఘురామ, మరోవైపు పవన్ కల్యాణ్ ఉండడం గమనార్థం. పైగా, పవన్ కల్యాణ్ కు ఇష్టమైన ‘పోరాడితే పోయేదేం లేదు బానిస సంకెళ్లు తప్ప’ అనే నినాదం కూడా ఆ ఫ్లెక్సీలపై దర్శనమిస్తోంది. ఇటీవల రఘురామ మాట్లాడుతూ తాను పవన్ కల్యాణ్ ఫ్యాన్ అని చెప్పడం తెలిసిందే.