భర్తతో సర్దుకుపొమ్మని చెప్పడాన్ని వేధింపులుగా పరిగణించలేం: సుప్రీంకోర్టు!
- భర్త, అతడి సోదరుడు, అత్తమామలు మోసం చేశారంటూ మహిళ ఫిర్యాదు
- ఆమె ఫిర్యాదుతో భర్త సోదరుడు అమెరికా వెళ్లేందుకు కోర్టు నిరాకరణ
- సుప్రీంకోర్టులో పిటిషనర్‌కు ఊరట
- సెక్షన్ 498ఎ నిబంధనను వివరించిన కోర్టు
భర్తతో సర్దుకు పొమ్మని కోడలికి చెప్పడం, ఆమె నగలను భద్రపరచడం వంటి వాటిని వేధింపులుగా పరిగణించలేమని భారత అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అంతేకాదు, విడిగా జీవిస్తున్న అన్నపై ప్రతీకార చర్యలకు దిగవద్దని వదినకు సలహా ఇవ్వడాన్ని కూడా వేధింపులుగా భావించలేమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.
భర్త, అతడి సోదరుడు, అత్తమామలు తనను మోసం చేశారని, నమ్మక ద్రోహానికి పాల్పడ్డారంటూ హర్యానాకు చెందిన ఓ మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. ఈ కేసును విచారించిన కురుక్షేత్రలోని చీఫ్ జుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు.. నిందితుల్లో ఒకరైన భర్త తమ్ముడు ముందస్తు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని ఆదేశించింది.
దీంతో అతడు పంజాబ్-హర్యానా హైకోర్టును ఆశ్రయించాడు. విచారించిన హైకోర్టు వదిన ఫిర్యాదు కారణంగా అమెరికా వెళ్లేందుకు అనుమతి నిరాకరించింది. దీంతో అతడు ఆ తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఊరట లభించింది.
కేసు పూర్వాపరాలను పరిశీలించిన జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ జేకే మహేశ్వరితో కూడిన ధర్మాసనం పిటిషనర్ అమెరికా వెళ్లేందుకు అనుమతినిచ్చింది. భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 498 ఏ నిబంధన ప్రకారం భార్యను భర్త, లేదంటే భర్త తరపు బంధువులు వేధించినప్పుడే ఇది వర్తిస్తుందని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది.