Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ప్రతిభకు మార్కులే కొలమానం కాదు..ఓబీసీ కోటా యథాతథమంటూ సుప్రీం!

ప్రతిభకు మార్కులే కొలమానం కాదు.. దానిని రిజర్వేషన్లతో ముడిపెట్టరాదు.. ఓబీసీ కోటా యథాతథమంటూ సుప్రీంకోర్టు తీర్పు!

  • ఈడబ్ల్యూఎస్ కోటాలోనూ మార్పు లేదన్న న్యాయస్థానం
  • రిజర్వేషన్లతో వెనుకబాటుతనాన్ని రూపుమాపొచ్చని కామెంట్
  • ప్రస్తుత నీట్ ప్రవేశాలకు ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కోటా అమలు
  • స్టే ఇస్తే ప్రవేశాలు మరింత ఆలస్యమవుతాయన్న కోర్టు

ప్రతిభకు ఎక్కువ మార్కులే కొలమానం కాదని పేర్కొన్న సుప్రీంకోర్టు.. నీట్ ప్రవేశాల్లో ఓబీసీ స్టూడెంట్లకు రిజర్వేషన్లను అనుమతిస్తూ జనవరి 7న ఇచ్చిన తీర్పుకే కట్టుబడి ఉండాలని స్పష్టం చేసింది. 2021–22 అడ్మిషన్లలో రిజర్వేషన్లను యథాతథంగా అమలు చేయాలని తేల్చి చెప్పింది.

‘‘సామాజిక ఆర్థిక అసమానతలకు అనుగుణంగా ప్రతిభను పరిగణనలోకి తీసుకోవాలి. రిజర్వేషన్లతో వెనుకబాటుతనాన్ని రూపుమాపొచ్చన్న విషయాన్ని మరచిపోకూడదు. రిజర్వేషన్లతో ప్రతిభను ముడిపెట్టరాదు. దాని వల్ల సామాజిక న్యాయం విషయంలో మరిన్ని పర్యవసానాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది’’ అని జస్టిస్ డి.వై. చంద్రచూడ్, జస్టిస్ ఎ.ఎస్. బోపన్నల ధర్మాసనం స్పష్టం చేసింది.

ఆర్థికంగా వెనుకబడిన కులాల (ఈడబ్ల్యూఎస్) కోటా విషయంలోనూ ఎలాంటి మార్పులుండవని, నీట్ ప్రవేశాల్లో అది కూడా అమల్లోనే ఉంటుందని పేర్కొంది. వార్షికాదాయం రూ.8 లక్షల లోపు ఉన్న వారు రిజర్వేషన్లకు అర్హులని తెలిపింది. ప్రవేశాలు జరిగే సమయంలో కోర్టులు జోక్యం చేసుకోవడం వల్ల ఆ ప్రవేశాల ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే ప్రమాదముందని పేర్కొంది. కాబట్టి 2021–22 బ్యాచ్ ప్రవేశాలకు సంబంధించి రిజర్వేషన్లపై ఎలాంటి స్టే ఇచ్చేది లేదని తీర్పునిచ్చింది.

ప్రస్తుతం మహమ్మారి కేసులు భారీగా పెరుగుతున్నాయని, ఇలాంటి టైంలో వైద్యుల నియామక ప్రక్రియ ఆలస్యమైతే ప్రజారోగ్యానికి తీవ్రమైన ముప్పేనని వ్యాఖ్యానించింది. కాబట్టి రిజర్వేషన్లకు సంబంధించి అన్ని వర్గాల వారి అభిప్రాయాలను వినకుండా స్టే విధించడం సబబు కాదని పేర్కొంది.

పోటీ పరీక్షలు అభ్యర్థుల శక్తిసామర్థ్యాలకు కొలమానం కాదని, అవి సామాజిక ఆర్థిక, సాంస్కృతికతను అవి ప్రతిబింబించలేవని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై మార్చి మూడో వారంలో తదుపరి విచారణ ఉంటుందని పేర్కొంటూ విచారణను వాయిదా వేసింది.

Related posts

ఎమ్మెల్సీ కవితకు తప్పిన ప్రమాదం

Drukpadam

Here Are 8 Editors-Approved IGK Hair Products You Need to Try

Drukpadam

ఏపీలో ఘోర ప్రమాదం .. నలుగురు దుర్మరణం!

Ram Narayana

Leave a Comment