టీఆర్ యస్ వీడుతున్నానని వస్తున్న వార్తలు పచ్చి అబద్దం:మాజీ ఎంపీ పొంగులేటి!
తాను ఏపీ సీఎం జగన్ కలిసింది రాజకీయాలకోసం కాదు పూర్తిగా వ్యక్తిగతం
ఇప్పుడే కాదు గతంలో అనేకసార్లు కలిశాను
తాను టీఆర్ యస్ లో సంతృప్తిగానే ఉన్నాను
తనకు అవకాశం రాకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి
సమయం వచ్చినప్పుడు పదవులు అవే వస్తాయి
కేసీఆర్ ,కేటీఆర్ పై నమ్మకం ఉంది
తాను టీఆర్ యస్ ను వీడుతున్నానని వేరే పార్టీ లో చేరుతున్నానని వస్తున్న వార్తలు పచ్చి అబద్దమని ఖమ్మం మాజీ ఎంపీ టీఆర్ యస్ నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొట్టి పారేశారు . అవి పుకార్లు , ఉహాజనితమైనవని అన్నారు . తాను పదవి ఉన్న లేకపోయినా ప్రజలకోసం పనిచేస్తానని అన్నారు. వారి అభిమానమే నన్ను నడిపిస్తుందని అన్నారు. కొద్దీ కాలంలోనే జిల్లాలో లక్షలాది మంది ఆదరణను చూరగొనడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు . పదవులు వస్తాయి పోతాయి. ప్రజలు అభిమానం ఎల్లప్పుడూ ఉండాలని అదే మనకు నిజమైన పదవి అని అన్నారు. తనను ప్రజలు ఇంతగా అభిమానిస్తారని అనుకోలేదని అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చిన తనను వారి ఆదరణ కట్టిపడేసింది అన్నారు . అందువల్లనే నిరంతరం ప్రజలకు దగ్గరగా ఉండాలని కోరుకుంటానని వారి కష్ట సుఖాల్లో పాలుపంచుకుంటానని అన్నారు . తనకు పార్టీ మారాల్సిన పరిస్థితులు ఏమి లేవని ప్రస్తుతం టీఆర్ యస్ లో తనకు ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు.
ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డిని కలవడం పై ఆయన్ను ప్రశ్నించగా ఇప్పుడే కాదు ఆయన్ను అనేక సార్లు కలిశాను …ఇది రాజకీయాలకోసం కాదు పూర్తిగా వ్యక్తిగతం అని అన్నారు . తాను అక్కడ రాజ్యసభ సీటు ఆశిస్తున్నట్లు వస్తున్న వార్తలు వాస్తవం కాదన్నారు .
తనకు రాజకీయంగా టీఆర్ యస్ లో అవకాశాలు లేకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయని ,సమయం వచ్చినప్పుడు తప్పకుండ అవకాశాలు వస్తాయని విశ్వాసం ఉందని అన్నారు. కేసీఆర్ ,కేటీఆర్ పై తనకు పూర్తీ నమ్మకం ఉందని పేర్కొన్నారు .