Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

బీజేపీకి గుడ్ బై చెప్పిన మనోహర్ పారికర్ తనయుడు ఉత్పల్…

బీజేపీకి   గుడ్ బై చెప్పిన మనోహర్ పారికర్ తనయుడు ఉత్పల్…
-సరైన వ్యక్తిని నిలిపితే పోటీ నుంచి తప్పుకొంటానని సవాల్
-పార్టీని వీడాలన్న నిర్ణయం ఎంతో బాధించింది
-ఆ నిర్ణయంతో తానూ సంతోషంగా లేనని కామెంట్
-తన తండ్రి వ్యతిరేకులు ఇంకా పార్టీలోనే ఉన్నారని వెల్లడి
-పెద్ద పెద్ద పదవులు అనుభవిస్తున్నారని వ్యాఖ్య

దేశ మాజీ రక్షణ మంత్రి, గోవా మాజీ సీఎం మనోహర్ పారికర్ తనయుడు ఉత్పల్ పారికర్ బీజేపీ నుంచి బయటకు వచ్చేశారు. తనకు బీజేపీ టికెట్ నిరాకరించడంతో పనాజీ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నట్టు ఆయన నిన్న ప్రకటించారు. అయితే, తాజాగా మరోసారి ఈ వ్యవహారంపై ఇవాళ ఆయన మాట్లాడారు. పనాజీ నుంచి మంచి అభ్యర్థిని నిలిపితే తాను తప్పుకొంటానని ఉత్పల్ పార్టీకి సవాల్ విసిరారు.

తానెప్పుడూ బీజేపీ వ్యక్తినే అని, పార్టీని నిలబెట్టేందుకు ఎంతో పోరాడుతున్నానని చెప్పారు. పార్టీని వీడాలని తీసుకున్న నిర్ణయం తనను ఎంతో బాధించిందని, అది చాలా కఠినమైన నిర్ణయమని అన్నారు. ఇలాంటిది జరగరాదని తాను ఎప్పుడూ అనుకుంటూ ఉండేవాడినన్నారు. తన నిర్ణయంతో తానూ సంతోషంగా లేనని చెప్పారు.

అయితే, ఇప్పటి చర్యలు.. 1994లో తన తండ్రికి టికెట్ ఇవ్వకుండా పక్కకు పెట్టేసేందుకు తీసుకున్న చర్యలను తలపిస్తున్నాయన్న వాదనలను ఆయన తోసిపుచ్చారు. చరిత్ర తెలిసిన వారికి తానేం చెబుతున్నానో అర్థమవుతుందన్నారు. ఆయనకు అప్పట్లో ప్రజల మద్దతు ఉంది కాబట్టే తన తండ్రిని బయటకు పంపించలేకపోయారన్నారు. తన తండ్రికి వ్యతిరేకులైన వారు ఇప్పటికీ పార్టీలో ఉన్నారని, పెద్దపెద్ద పదవులు అనుభవిస్తున్నారని పేర్కొన్నారు.

తన తండ్రి చనిపోయాక వచ్చిన 2019 పనాజీ ఉప ఎన్నికల్లోనూ తనకు టికెట్ నిరాకరించిన విషయాన్ని ఉత్పల్ గుర్తు చేశారు. తనకు మద్దతున్నా టికెట్ ఇవ్వలేదన్నారు. అప్పుడు పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించానని తెలిపారు.

Related posts

బ్రాహ్మణ కార్పొరేషన్ ను జగన్ నిర్వీర్యం చేశారు: కాశీభట్ల సాయినాథ్ శర్మ!

Drukpadam

బీఆర్ఎస్ కు షాక్ ఇచ్చిన లోక్ సభ సచివాలయం!

Drukpadam

ముగిసిన రాహుల్ గాంధీ తెలంగాణ టూర్‌…కాసేప‌ట్లో శంషాబాద్ నుంచి ఢిల్లీకి ప‌య‌నం!

Drukpadam

Leave a Comment