Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

భార‌తర‌త్న గాయ‌ని ల‌తా మంగేష్క‌ర్ ఇక‌లేరు!

భార‌తర‌త్న గాయ‌ని ల‌తా మంగేష్క‌ర్ ఇక‌లేరు
-ఆసుప‌త్రిలో చికిత్స తీసుకుంటూ తుదిశ్వాస
-ప్ర‌క‌టించిన కేంద్ర మంత్రి నితిన్ గడ్క‌రీ
-దాదాపు నెల‌రోజులుగా చికిత్స తీసుకున్న గాయ‌ని
-దేశం మొత్తాన్ని తీయ‌ని గానంతో అల‌రించి గానకోకిలగా వెలుగొందిన‌ ల‌తా మంగేష్క‌ర్
-గాయ‌నిగా ఎవ‌రికీ అంద‌ని రికార్డులు
-1929, సెప్టెంబరు 28న మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో జ‌న్మించిన ల‌తా మంగేష్క‌ర్
-తెలుగులోనూ పాట‌లు పాడిన గాన‌కోకిల‌
-దాదాపు 20 భాషల్లో 50 వేలకుపైగా పాటలు
-ఆమెకు 2001లో భార‌తర‌త్న

ప్రముఖ సినీ గాయని లతా మంగేష్కర్‌ (92) ఇక‌లేరు. ఆసుప‌త్రిలో చికిత్స తీసుకుంటూ ఆమె క‌న్నుమూశార‌ని కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్క‌రీ ప్ర‌క‌టించారు. ప‌లు అవ‌య‌వాలు ప‌నిచేయ‌క‌పోవ‌డంతో ల‌తా మంగేష్క‌ర్ ప‌రిస్థితి విష‌మించి, క‌న్నుమూసిన‌ట్లు ఆసుప‌త్రి వైద్యులు కూడా ప్ర‌క‌టించారు.
ల‌తా మంగేష్క‌ర్‌కు క‌రోనా సోకడంతో ఆమెను దాదాపు నెల రోజుల క్రితం ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుప‌త్రిలో చేర్చిన విష‌యం తెలిసిందే. న్యూమోనియాతోనూ ఆమె బాధ‌ప‌డ్డారు.

ఆమెకు ఐసీయూలో వైద్యులు చికిత్స అందించారు. వ‌య‌సు రీత్యా మ‌రిన్ని అనారోగ్య స‌మ‌స్య‌లు ఎదుర్కోవ‌డంతో ఆమె ప్రాణాలు కోల్పోయారు. కాగా, 2019లోనూ శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతూ లతా మంగేష్కర్‌ ఆసుపత్రిలో చేరి, కోలుకున్న విష‌యం తెలిసిందే.

లతా మంగేష్కర్‌ ఇక‌లేరన్న వార్త‌ను ఆమె అభిమానులు జీర్ణించుకోలేక‌పోతున్నారు. గాయ‌నిగా ఎవ‌రికీ అంద‌ని రికార్డుల‌ను సొంతం చేసుకున్న ఆమె పాట‌ల‌ను దేశ ప్ర‌జ‌లు ఎన్న‌టికీ మ‌ర్చిపోలేరు. త‌న‌ పాటలతో చరిత్రలో నిలిచిన లతా మంగేష్కర్ 1929, సెప్టెంబరు 28న మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఇండోర్‌లో జన్మించారు.

దీనానాథ్ మంగేష్కర్, శుద్దమతిలకు ఆమె మొదటి సంతానం. గానకోకిల బిరుదుతో వెలుగొందారు.
ఆమె తెలుగులోనూ అనేక పాట‌లు పాడారు. 1955లో నాగేశ్వ‌ర‌రావు సినిమా సంతానంలో ‘నిదుర పోరా తమ్ముడా’ పాట‌, 1965లో ఎన్టీఆర్ సినిమా ‘దొరికితే దొంగలు’లో శ్రీ వేంకటేశ పాట, 1988 లో నాగార్జున ‘ఆఖరి పోరాటం’ సినిమాలో తెల్ల చీర పాట పాడారు.

ల‌తా మంగేష్క‌ర్‌ 1948 నుంచి 1978 వరకు 30,000 పాటలు పాడి, అన్ని పాట‌లు పాడిన‌ ఏకైక గాయనిగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో పేరు సంపాదించుకున్నారు. అనంత‌రం 1959లో టైం మేగజైన్ కవర్ పేజీ స్టోరీగా లతామంగేష్కర్ గురించి వ్యాసాన్ని ప్రచురించింది. ఆమెను భారతీయ నేపథ్య గాయకుల రాణిగా పేర్కొంది.

ల‌తా మంగేష్క‌ర్‌కు నైటింగేల్‌ ఆఫ్‌ ఇండియాగానూ పేరు ఉంది. త‌న కెరీర్‌లో ఆమె దాదాపు 20 భాషల్లో 50 వేలకుపైగా పాటలు పాడారు. హిందీలో ఆమె పాడిన పాటు ఇప్ప‌టికీ ప్రేక్ష‌కుల‌ను అలరిస్తూనే ఉన్నాయి. భారత ప్రభుత్వం ఆమెకు 2001లో భార‌తర‌త్న అందించింది. ప్రముఖ శాస్త్రీయ గాయకురాలు ఎంఎస్ సుబ్బలక్ష్మి తరువాత ఇటువంటి ఘనత సాధించిన వ్యక్తి ల‌తా మంగేష్క‌ర్‌ ఒక్కరే. 1999లో ఆమె ప‌ద్మ విభూషణ్, 1969లో పద్మభూషణ్ కూడా అందుకున్నారు. 2006లో ఆమెకు ఫ్రాన్స్ ప్ర‌భుత్వం ది లీజియన్ అఫ్ హానర్ పుర‌స్కారం అంద‌జేసింది.

Related posts

తిరుమల నుంచి అలిగి వెళ్లిపోయిన వైసీపీ ఎంపీ రెడ్డెప్ప!

Drukpadam

కరోనా. ఎఫెక్ట్ : స్కూళ్ల కు వేసవి సెలవులు పొడిగింపు-ఏపీ సర్కార్

Drukpadam

మాఘ మాసం పౌర్ణమికి ముందు రోజున ఈ ఊరంతా ఖాళీ అవుతుంది… ఎందుకంటే…!

Drukpadam

Leave a Comment