ఏపీఎస్ ఆర్టీసీ డ్రైవర్‌పై మహిళ వీరంగం.. డ్రైవర్ చొక్కా పట్టుకుని కాలితో తన్ని నానా రభస!
- ద్విచక్ర వాహనంపై వెళ్తూ బస్సుకు అడ్డం వచ్చిన మహిళ
- సడన్ బ్రేక్ వేసిన డ్రైవర్
- ఇద్దరినీ పోలీస్ స్టేషన్‌కు తరలించిన పోలీసులు
- మహిళపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు
విజయవాడలో ఓ మహిళ ఏపీఎస్ ఆర్టీసీ డ్రైవర్‌పై దాడిచేసింది. కాలితో తన్నింది. చొక్కాను పట్టుకుని లాగి చింపేసింది. పోలీసుల కథనం ప్రకారం.. నిన్న మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో ఏపీఎస్ ఆర్టీసీ విద్యాధరపురం డిపోకు చెందిన బస్సు ప్రకాశం రోడ్డులో వెళ్తోంది.
అదే సమయంలో ఆంధ్రా ఆసుపత్రి సమీపంలో కృష్ణలంక తారకరామానగర్‌కు చెందిన నందిని అనే మహిళ ద్విచక్ర వాహనంపై వెళ్తూ బస్సుకు అడ్డం వచ్చింది. డ్రైవర్ ముసలయ్య సడెన్ బ్రేక్ వేయడంతో బస్సు ఆమె ద్విచక్ర వాహనం సమీపంలోకి వచ్చి ఆగింది.
దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన మహిళ వెంటనే బస్సెక్కి డ్రైవర్‌పై దాడిచేసింది. చొక్కా పట్టుకుని లాగి చింపేసింది. ముఖంపై పిడిగుద్దులు కురిపించింది. కాలితో తన్నింది. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని డ్రైవర్, మహిళను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దాడిచేసిన మహిళపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.