Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

తప్పుడు ధ్రువపత్రం కేసు.. ఎమ్మెల్సీ అశోక్‌బాబు అరెస్ట్

బీకాం చదివినట్టు తప్పుడు ధ్రువపత్రం కేసు.. టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు అరెస్ట్

  • మఫ్టీలో అశోక్ బాబు ఇంటి వద్ద కాపుకాసిన పోలీసులు
  • రాత్రి 11.30 గంటల సమయంలో అరెస్ట్
  • అర్ధరాత్రి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందన్న చంద్రబాబు
  • అశోక్ బాబు అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పిన లోకేశ్

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్‌బాబు గత రాత్రి అరెస్టయ్యారు. వాణిజ్య పన్నుల శాఖలో పనిచేసిన సమయంలో బీకాం చదవకపోయినా చదివినట్టు తప్పుడు ధ్రువీకరణ పత్రం సమర్పించినట్టు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో గత రాత్రి 11.30 గంటల సమయంలో అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అశోక్ బాబు డిగ్రీ విషయమై విజయవాడకు చెందిన మెహర్ కుమార్  గతంలో లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. స్పందించిన లోకాయుక్త వాణిజ్య పన్నుల విభాగం నుంచి నివేదిక తెప్పించుకుని, దీనిపై విచారణ జరిపించాలని కోరింది.

రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ సంయుక్త కమిషనర్ డి.గీతామాధురి ఇటీవల అశోక్ బాబుపై సీఐడీ అధికారులుకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న సీఐడీ పోలీసులు నిన్న అశోక్‌బాబు ఇంటి వద్ద మఫ్టీలో కాపుకాశారు. ఓ వివాహవేడుకకు హాజరైన అశోక్‌బాబు రాత్రి 11.30 గంటల సమయంలో ఇంటికి రాగా, అప్పటికే అక్కడ కాపుకాసిన పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. నేడు ఆయనను కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది.

మరోపక్క, ఎమ్మెల్సీ అశోక్‌బాబు అరెస్ట్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. అర్ధరాత్రి అరెస్ట్ చేయాల్సినంత అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. ఉద్యోగుల సమస్యలపై నిలదీస్తున్నందుకు ప్రభుత్వం ఆయనపై కక్ష కట్టిందని, సర్వీస్ మేటర్స్‌లో తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కూడా అశోక్ బాబు అరెస్ట్‌ను తీవ్రంగా ఖండించారు. అశోక్ బాబు అరెస్ట్‌ను కోర్టులోనే తేల్చుకుంటామని టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ అన్నారు.

Related posts

అత్యంత ఘనంగా బ్రిటన్ రాజు చార్లెస్-3 పట్టాభిషేకం…

Drukpadam

తిరుపతి ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా ఐజేయూ నేషనల్ కౌన్సిల్ సభ్యులు మురళి ఎన్నిక

Ram Narayana

సిద్ధరామయ్య నేపద్యం….

Drukpadam

Leave a Comment