- సమతామూర్తిని సందర్శించిన వెంకయ్య
- తనకు లభించిన మహాభాగ్యం అని వెల్లడి
- సమతామూర్తి స్ఫూర్తిని అందరికీ పంచాలని పిలుపు
భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హైదరాబాదు ముచ్చింతల్ ఆశ్రమానికి విచ్చేశారు. ఇక్కడి శ్రీరామనగరంలో ఏర్పాటు చేసిన సమతామూర్తి శ్రీరామానుజాచార్యుల వారి విగ్రహాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, సమతామూర్తి సందర్శన తనకు లభించిన మహాభాగ్యం అని వెల్లడించారు. సమతామూర్తి కేంద్రం ప్రపంచంలో 8వ వింత అని అభివర్ణించారు. ధర్మ పరిరక్షణకు సమతామూర్తి ప్రతిమ ప్రేరణ కలిగిస్తుందని తెలిపారు.
రామానుజాచార్యులు సామాజిక సంస్కరణాభిలాషి అని, ప్రజలంతా సమానమని వెయ్యేళ్ల కిందటే చాటారని పేర్కొన్నారు. దళితులను ఆలయప్రవేశం చేయించిన మానవతావాది రామానుజుడు అని ప్రస్తుతించారు. కులం కంటే గుణం గొప్పదని ఎలుగెత్తారని వివరించారు. సమతామూర్తి కేంద్రాన్ని ఎన్నో దేశాల నుంచి ఎందరో వచ్చి సందర్శిస్తున్నారని వెంకయ్యనాయుడు తెలిపారు. సమతామూర్తి స్ఫూర్తిని పెంచడమే కాదు, అందరికీ పంచాలని పిలుపునిచ్చారు.