ప్రధాని రాక ఉందంటూ సీఎం చన్నీ హెలికాఫ్టర్ కు అనుమతి నిరాకరణ…
కాంగ్రెస్ వర్గాల భగ్గుభగ్గు …కేంద్రం కావాలని చేస్తుందని ఆరోపణలు
ఎన్నికల సంఘానికి ఫిర్యాదు
బీజేపీ కుటిల రాజకీయాలకు తార్కాణమని వెల్లడి
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కాయి. ఇప్పటికే అధికార కాంగ్రెస్ ను ఈసారి ఎలాగైనా ఓడించేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీ .. అంతకంటే ముందు సీఎం చరణ్ జీత్ సింగ్ చన్నీతో మైండ్ గేమ్ మొదలుపెట్టింది. ఇందులో భాగంగా సీఎం చరణ్ జీత్ సింగ్ చన్నీ హెలికాఫ్టర్ టేకాఫ్ అయ్యేందుకు అధికారులు అనుమతి ఇవ్వకపోవడం కలకలం రేపుతోంది.దీనిపై కాంగ్రెస్ వర్గాలు భగ్గుభగ్గు మంటున్నాయి . బీజేపీ కుటిల రాజకీయాలకు తార్కాణంగా ఈ చర్య నిలిచిందని కాంగ్రెస్ ఆరోపణలు గుప్పించింది. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని వెల్లడించింది .
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా జలంధర్‌లో జరిగే ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోడీ ప్రసంగించాల్సి ఉంది.ప్రధాని రాక నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని ‘నో-ఫ్లై జోన్’ గా ప్రకటించడంతో ఇవాళ పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ హెలికాప్టర్‌ను చండీగఢ్ నుంచి టేకాఫ్ చేయడానికి అనుమతించలేదు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఎన్నికల ర్యాలీలో పాల్గొనేందుకు సీఎం చన్నీ పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌కు వెళ్లాల్సి ఉంది. అయితే కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ హెలికాప్టర్‌ను హోషియార్‌పూర్‌లో ల్యాండ్ చేయడానికి అనుమతించారు. సీఎం హెలికాఫ్టర్ ను కావాలనే వెళ్లకుండా నిరోదించారని కాంగ్రెస్ మండిపడింది.
తాజా పరిణామాలపై కాంగ్రెస్ నేత సునీల్ జాఖర్ స్పందిస్తూ, సీఎం చన్నీ షెడ్యూల్ ప్రకారం హోషియార్ పూర్ కు రావాల్సి ఉందని, అయితే కేంద్ర ప్రభుత్వం చరణ్‌జిత్ సింగ్ చన్నీ హోషియార్‌పూర్‌కు రావడానికి అనుమతిని రద్దు చేయడం సిగ్గుచేటన్నారు. ఎన్నికల సంఘం దీనిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఇది ఎన్నికల నేపథ్యంలో ఓ ప్రహసనంగా ఆయన అభివర్ణించారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు ఒకే దశలో ఫిబ్రవరి 20న జరగనుండగా.. మార్చి 10న ఓట్ల లెక్కింపు జరగనుంది.