కరోనా గుప్పిట నుంచి బయటపడుతున్న ప్రపంచ దేశాలు! బ్రిటన్ లో ఆంక్షలు పూర్తిగా తొలగింపు?
- గణనీయంగా తగ్గిన కొత్త కేసులు
- అంతర్జాతీయ విమానాలకు ఆస్ట్రేలియా అనుమతి
- పర్యాటకులకు ఇజ్రాయెల్ ఆహ్వానం
- బ్రిటన్ లో ఆంక్షలు ఎత్తివేసే ప్రణాళిక
- ఆంక్షలు సడలించడంపై డబ్ల్యూహెచ్ వో ఆందోళన
చైనాలో మొదటి కరోనా వైరస్ వెలుగు చూసి రెండేళ్లు దాటిపోయింది. అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాలు కరోనా ప్రభావాన్ని ఎక్కువ చవిచూశాయి. లక్షలాది మందిని నష్టపోవాల్సి వచ్చింది. ఈ విపత్కర పరిస్థితులు చాలా వరకు నెమ్మదించాయి. దీంతో ప్రపంచ దేశాలు క్రమంగా తిరిగి సాధారణ పరిస్థితులకు మళ్లుతున్నాయి. ఆంక్షలను క్రమంగా ఎత్తివేసే దిశగా అడుగులు వేస్తున్నాయి.
కరోనా పేరిట విధించిన అన్ని రకాల ఆంక్షలను ఎత్తివేయాలన్నది బ్రిటన్ సర్కారు ఆలోచన. కరోనాతో కలసి జీవించే విధానాన్ని రూపొందించింది. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ దీన్ని పార్లమెంటు ముందు ఉంచనున్నారు. దీంతో కరోనా మహమ్మారి గుప్పిట నుంచి బయట పడి ఆర్థికంగా పుంజుకోవాలన్న ప్రణాళికతో బోరిస్ జాన్సన్ సర్కారు పనిచేస్తోంది.
ప్రజలు స్వేచ్ఛగా సంచరించడంతోపాటు, అన్ని రకాల ప్రయాణ సాధనాలను వినియోగించుకునేందుకు, షాపింగ్ కు అనుమతించాలన్నది ఈ ప్రణాళికలో భాగం. బ్రిటన్ ఈ దిశగా అడుగులు వేస్తే, వచ్చే ఫలితాలను చూసి ఇతర ప్రపంచ దేశాలు కూడా అనుసరించే అవకాశం లేకపోలేదు.
ఆస్ట్రేలియా అంతర్జాతీయ ప్రయాణికులకు సోమవారం నుంచి ద్వారాలు తెరిచింది. అమెరికాలో కొత్త కేసుల నమోదు, ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టింది. గత శనివారం అమెరికాలో లక్ష కొత్త కేసులు రాగా, ఐదు వారాల క్రితం 8 లక్షల కేసులు రోజువారీగా రావడం గమనార్హం. న్యూయార్క్ లో కొత్త కేసులు 50 శాతం తగ్గిపోయాయి.
కరోనా టీకాలు తీసుకోపోయినా పర్యాటకులు ఇజ్రాయెల్ ఆహ్వానం పలికింది. ఏప్రిల్ నుంచి భారత్ కూడా పూర్తి స్థాయి అంతర్జాతీయ విమాన సర్వీసులకు అనుమతించనుంది. మన దేశంలోనూ రోజువారీ కరోనా కేసులు 16వేలకు పడిపోయాయి.
దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్) ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుత పరిస్థితులు మరింత వ్యాప్తి చెందే, ప్రమాదకరమైన కరోనా వేరియంట్లకు వీలు కల్పిస్తాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అదనోమ్ గెబ్రెయేసెస్ హెచ్చరించారు. ఆంక్షలను సడలించొద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనగా ఉంది.