వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయిరెడ్డికి సీఎం వైఎస్ జగన్ మరో బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఇప్పటికే పార్టీలో విజయసాయిరెడ్డి ప్రాధాన్యం తగ్గిందని ప్రచారం జరుగుతున్న వేళ.. జగన్ ఆయనకు ఇచ్చిన ఆఫర్ ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ కొత్త బాధ్యతల్లో సాయిరెడ్డి ఏ మేరకు రాణిస్తారో చూడాల్సి ఉంది.
వైసీపీకి చెందిన అన్ని అనుబంధ విభాగాలకు ఎంపీ వేణుంబాక విజయసాయిరెడ్డిని ఇన్ ఛార్జ్ గా నియమిస్తూ సీఎం జగన్ ఇవాళ ఆదేశాలు ఇచ్చారు. ఈ మేరకు పార్టీ ప్రెస్ నోట్ విడుదల చేసింది. దీంతో సాయిరెడ్డి ఇకపై పార్టీలో ఉన్న అన్ని విభాగాల బాధ్యులకు ఇన్ ఛార్జ్ గా వ్యవహరించబోతున్నారు. గతంలో వైసీపీ ఉత్తరాంధ్ర ఇన్ ఛార్జ్ గా ఉన్న విజయసాయిరెడ్డిని స్ధానిక వివాదాల నేపథ్యంలో తప్పించారు. ఆ తర్వాత నుంచి సాయిరెడ్డి కేవలం వైసీపీ పార్టమెంటరీ పార్టీ నేతగా మాత్రమే కొనసాగుతున్నారు. ఇప్పుడు కొత్త పదవితో ఆయనకు బాధ్యత పెరగనుంది.
జగన్ సీఎం అయ్యాక వైసీపీపై ఆయన పట్టు క్రమంగా సడలుతోంది. దీంతో వచ్చే ఎన్నికల నాటికి పార్టీలో అనుబంధ విభాగాల నుంచి ప్రారంభించి అన్ని విధాలా బలపడాలని భావిస్తున్న జగన్.. ఈ మేరకు సాయిరెడ్డికి ఈ కీలక బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పార్టీలో కీలక వ్యవహారాలన్నీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి నిర్వహిస్తున్నారు. ఓ దశలో పార్టీ అధ్యక్షుడిగా సజ్జలను జగన్ నియమిస్తారన్న ప్రచారం కూడా జరిగింది. కానీ అలా జరగలేదు. దీంతో ఆయన పార్టీ, ప్రభుత్వం మధ్య సమన్వయంతో పాటు పలు కీలక వ్యవహారాలకు పరిమితం అవుతున్నారు. ఆయనతో పాటు కీలకంగా ఉన్న సాయిరెడ్డికి ఇప్పుడు అనుబంధ సంఘాల బాధ్యతలు అప్పగించడంతో ఆ మేరకు బ్యాలెన్స్ చేసినట్లయింది.