22 ఎకరాల వెంచర్ పై గొడవ.. రన్నింగ్ కారుపై జరిపిన కాల్పుల్లో ఒకరి మృతి!
- మరొకరికి తీవ్రగాయాలు
- ఇబ్రహీంపట్నం సమీపంలోని కర్ణంగూడ వద్ద ఘటన
- పార్ట్ నర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
రియల్ ఎస్టేట్ వ్యాపారుల కారుపై జరిగిన కాల్పులు కలకలం సృష్టించాయి. ఇవాళ ఉదయం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నానికి సమీపంలోని కర్ణంగూడ వద్ద ఈ ఘటన జరిగింది. కాల్పుల్లో శ్రీనివాస్ రెడ్డి అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి మరణించగా.. మరో వ్యాపారి రాఘవేందర్ రెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు.
ఇవాళ ఉదయం కర్ణంగూడ వద్ద అక్కడి స్థానికులు కారును గుర్తించారు. ఒకరు చనిపోయి ఉండడం, మరొకరు స్పృహ కోల్పోయి ఉండడాన్ని గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. గాయపడిన వ్యక్తిని అంబర్ పేటకు చెందిన రాఘవేందర్ రెడ్డిగా గుర్తించి.. బీఎన్ రెడ్డిలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. శ్రీనివాస్ రెడ్డిది అల్మాస్ గూడ అని నిర్ధారించారు. కారు రన్నింగ్ లో ఉండగా దుండగులు ఒక్కసారిగా కాల్పులు జరిపారని రాఘవేందర్ రెడ్డి పోలీసులకు చెప్పారు.
పటేల్ గూడలో వేసిన 22 ఎకరాల వెంచర్ పై గొడవ వల్లే కాల్పులు చోటుచేసుకున్నాయని బాధితుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మట్టారెడ్డి అనే వ్యక్తితో కలిసి శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డి వెంచర్ వేశారని, దానిపై కొన్ని నెలలుగా గొడవ జరుగుతోందని చెబుతున్నారు. దాని గురించి మాట్లాడేందుకు రావాల్సిందిగా ఇవాళ ఉదయం మట్టారెడ్డి పిలిచాడని ఆరోపించారు. ఈ క్రమంలోనే బయల్దేరిన శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డిలపై అతడే కాల్పులకు దిగి ఉంటాడని అనుమానం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.