బీజేపీ ఎమ్మెల్యేల అరెస్ట్.. బొల్లారం పీఎస్‌కు తరలింపు!
- గవర్నర్ ప్రసంగం లేని వైనంపై బీజేపీ సభ్యుల నిరసన
- ముగ్గురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిన స్పీకర్
- అసెంబ్లీ ముందు బీజేపీ ఎమ్మెల్యేల నిరసన
- అరెస్ట్ చేసి బొల్లారం పీఎస్‌కు తరలించిన పోలీసులు
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజుననే బీజేపీకి షాక్ తగిలింది. బడ్జెట్ సమావేశాలను గవర్నర్ ప్రసంగం లేకుండా ఎలా ప్రారంభిస్తారంటూ బీజేపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు రాజా సింగ్, రఘునందన్ రావు, ఈటల రాజేందర్‌లు కేసీఆర్ సర్కారును నిలదీశారు. ఈ సందర్భంగా సభ ప్రారంభం కాగానే బీజేపీ ఎమ్మెల్యేలు నిరసనకు దిగడంతో వారిని సభ నుంచి సస్పెండ్ చేస్తూ టీఆర్ఎస్ సభలో తీర్మానం ప్రవేశపెట్టింది. ఈ తీర్మానం మేరకు ఈ సమావేశాలు ముగిసేదాకా బీజేపీ ఎమ్మెల్యేలను సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.
అయితే, తమను సస్పెండ్ చేసిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ముందు నిరసనకు దిగారు. ఈ సందర్భంగా వారు కేసీఆర్ సర్కారు తీరును నిరసిస్తూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ముగ్గురు ఎమ్మెల్యేలను బొల్లారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.