కోర్టు తీర్పు నేపథ్యంలో అమరావతి ఉద్యమానికి విరామం!
- కోర్టు తీర్పు నేపథ్యంలో డోలాయమానంలో జేఏసీ నేతలు
- సమావేశంలో కుదరని ఏకాభిప్రాయం
- అసెంబ్లీ సమావేశాల వరకు శిబిరాలు కొనసాగించాలని నిర్ణయం
- ఆ తర్వాత మరోమారు సమావేశమై భవిష్యత్ కార్యాచరణ
ఆంధ్రప్రదేశ్‌కు అమరావతే ఏకైక రాజధాని అని ఏపీ హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో అమరావతి ఉద్యమానికి ఫుల్‌స్టాప్ పెట్టాలా? లేదంటే తాత్కాలికంగా విరామం ప్రకటించాలా? అన్నదానిపై నిన్న వెలగపూడి రైతు జేఏసీ కార్యాలయంలో సమావేశం జరిగింది. ధర్నా శిబిరాల నిర్వాహకులు, రైతు జేఏసీ సభ్యులు ఇందులో పాల్గొన్నారు. వారి నుంచి ఈ విషయమై అభిప్రాయాలు సేకరించారు.
ఈ సందర్భంగా, అమరావతే ఆంధ్రప్రదేశ్ రాజధాని అని కోర్టు తేల్చి చెప్పినందున ఉద్యమానికి తాత్కాలికంగా కొంత విరామం ప్రకటించాలని కొందరు నేతలు అభిప్రాయపడ్డారు. అయితే, ప్రధాన శిబిరాలను మాత్రం కొనసాగించాలని మరికొందరు, అసెంబ్లీ సమావేశాల వరకు కొనసాగించి ఆ తర్వాత తాత్కాలికంగా కొంత విరామం ప్రకటిద్దామని ఇంకొందరు అభిప్రాయపడ్డారు.
అమరావతే ఎలాగూ ఏపీ రాజధాని అని కోర్టు చెప్పింది కాబట్టి, అభివృద్ధి పనులు ప్రారంభించాలని ఉద్యమం చేపడదామని రైతు నాయకులు పేర్కొన్నారు. అయితే, సమావేశంలో ఎలాంటి నిర్ణయమూ తీసుకోకపోవడంతో ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల వరకు శిబిరాలను కొనసాగించాలని, ఆ తర్వాత అందరి అభిప్రాయాలను తీసుకుని తదుపరి కార్యాచరణ రూపొందించాలని సమావేశంలో జేఏసీ నేతలు నిర్ణయం తీసుకున్నారు.