అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్, ఎమ్మెల్యే రసమయి మధ్య వాగ్వివాదం!
-సొంత పార్టీ సభ్యుల మధ్య వాదనతో సభ్యుల్లో ఆశక్తికర చర్చ
-రసమయి మాట్లాడుతుండగా మైక్ కట్
-డిప్యూటీ స్పీకర్‌పై రసమయి అసంతృప్తి
-మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదని మండిపాటు
-ప్రశ్నలే అడగకూడదని భావిస్తున్నారని ఆరోపణ
-ఇక ఈ ప్రశ్నోత్తరాలు చేపట్టడం ఎందుకని ప్రశ్న
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. శాసనసభలో ప్రశ్నోత్తరాలు చేపట్టారు. ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ పద్మారావు, టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. సభలో రసమయి బాలకిషన్ ప్రశ్నలు అడుగుతోన్న సమయంలో డిప్యూటీ స్పీకర్ పద‍్మారావు మైక్ కట్ చేయడంతో ఈ వివాదం మొదలైంది.
రసమయి మైక్ ను కట్ చేసి, ఎమ్మెల్యే గొంగడి సునీతను మాట్లాడాలని పద్మారావు చెప్పారు. దీంతో రసమయి ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో మాట్లాడానికి అవకాశాలు రావని, ఇప్పుడు కనీసం ప్రశ్నలు అడిగే అవకాశం కూడా ఇవ్వట్లేదని వాపోయారు. అసలు ప్రశ్నలే అడగకూడదని భావిస్తున్నప్పుడు ఈ ప్రశ్నోత్తరాలు చేపట్టడం ఎందుకని ప్రశ్నించారు. సభలో తాను అడుగుతున్నది ప్రశ్నలే అని చెప్పారు.
దీంతో ఆయన వ్యాఖ్యలపై పద్మారావు స్పందిస్తూ.. త్వరగా ప్రశ్నలే అడగండని, ఈ సమయంలో ప్రసంగాలు చేయకూడదని అన్నారు. గంటన్నరలో 10 ప్రశ్నలు పూర్తి చేసుకోవాల్సి ఉంటుందని వివరించారు. దీంతో మళ్లీ అసహనం వ్యక్తం చేసిన రసమయి బాలకిషన్ తన కుర్చీలో మౌనంగా కూర్చుండిపోయారు.
దీంతో ఓ మంత్రి కలగజేసుకుని సర్దిచెప్పబోయారు. అయితే, ఆయనపై కూడా రసమయి అసంతృప్తి వ్యక్తం చేశారు. కాగా, నేడు చేపల పెంపకంతో పాటు హైదరాబాద్ లో నాలాల అభివృద్ధిపై కూడా చర్చిస్తున్నారు. రాష్ట్రంలో నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమం, ఆర్టీసీ బస్ ల సౌకర్యంపై మంత్రులు సమాధానాలు ఇస్తున్నారు. ప్రశ్నోత్తరాలు ముగిశాక బడ్జెట్ పద్దులపై చర్చించనున్నారు. అనంతరం, రాష్ట్రంలో సాంకేతిక విద్య, పర్యాటకం, అడవుల అభివృద్ధిపై కూడా సభలో చర్చ జరగనుంది.
ఈ విషయం సీఎం దృష్టికి వెళ్ళింది. అయితే ఆయన రసమయ కి క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తున్నది . హరీష్ రావు , శాసనసభ వ్యవహారాలు మంత్రులు కూడా రసమయ సర్ది చెప్పినట్లు సమాచారం సొంతపార్టీ శాసనసభ్యులు సభలో ఈ విధంగా ప్రవర్తించడంపై సీఎం సీరియస్ గా ఉన్నారని అంటున్నారు .