రేవంత్‌కు వ్యతిరేకంగా కీలక నేతల భేటీ?
- శశిధర్ రెడ్డి ఇంటిలో భేటీ
- సెంటరాఫ్ అట్రాక్షన్‌గా జగ్గారెడ్డి, వీహెచ్
- మాజీ మంత్రులు శ్రీధర్ రెడ్డి, పొన్నాల, గీతారెడ్డిల హాజరు
తెలంగాణ రాజకీయ పార్టీల్లో ఆయా పార్టీల బాసులపై అసంతృప్త రాగాలు వ్యక్తమవుతున్నసంగతి తెలిసిందే. ఇప్పటికే తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌కు వ్యతిరేకంగా ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు వరుసబెట్టి రహస్య భేటీలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ వివాదం ఇప్పుడు సమసినట్టే కనిపించగా…ఇప్పుడు కాంగ్రెస్ వంతు వచ్చింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీరును నిరసిస్తూ ఆ పార్టీకి చెందిన కీలక నేతలు ప్రత్యేకంగా భేటీ అయ్యారట.
పార్టీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి ఇంటిలో జరిగిన ఈ భేటీకి రేవంత్ తీరును బహిరంగంగానే వ్యతిరేకిస్తూ వస్తున్న సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి (జగ్గారెడ్డి), మాజీ ఎంపీ వి.హన్మంతరావు, మాజీ మంత్రులు గీతారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పార్టీ సీనియర్ నేత కోదండ రెడ్డిలతో పాటు మరికొందరు నేతలు హాజరయ్యారట. సీనయర్లను పట్టించుకోకుండా రేవంత్ వ్యవహరిస్తున్న తీరుపై ఈ భేటీలో చర్చ జరగ్గా.. ఈ అంశంపై త్వరలోనే పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేయాలని తీర్మానించినట్లుగా సమాచారం. మొత్తంగా టీపీసీసీ చీఫ్ రేవంత్‌కు వ్యతిరేకంగా జరిగిన ఈ భేటీపై ఇప్పుడు పెద్ద చర్చే నడుస్తోంది.