లైవ్ టీవీలో రష్యాకు వ్యతిరేకంగా మహిళా ఉద్యోగి నిరసన.. 15 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం..
- ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణను నిరసిస్తూ లైవ్‌లో ప్లకార్డు ప్రదర్శన
- ప్రభుత్వ టీవీ ‘చానల్ 1’లో ఘటన
- వెంటనే అదుపులోకి తీసుకున్న పోలీసులు
- రష్యన్లను జాంబీలుగా మార్చే ప్రయత్నం జరుగుతోందంటూ ఆవేదన
ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణను వ్యతిరేకిస్తూ టీవీ లైవ్‌లో ప్లకార్డు పట్టుకుని నిరసన తెలిపిన మహిళా ఉద్యోగిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడామెకు 15 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. రష్యా ప్రభుత్వ యాజమాన్యంలోని టీవీ చానల్‌లో వార్తా బులెటిన్ ప్రసారమవుతుండగా దూసుకొచ్చిన ఓ ఉద్యోగిని యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ ప్లకార్డును ప్రదర్శించడం కలకలం రేపింది.
ఆమె పేరు మరీనా ఓవ్స్యానికోవా. ఆమె మాస్కోలోని ప్రభుత్వ టీవీ.. చానల్ 1 ఉద్యోగి. ‘యుద్ధం వద్దు. యుద్ధాన్ని ఆపండి. అబద్ధపు ప్రచారాలు నమ్మకండి’ అని ఉన్న పోస్టర్‌ను ఆమె ప్రదర్శించారు. పోలీసులు తనను అదుపులోకి తీసుకున్న అనంతరం మరీనా మాట్లాడుతూ.. తనను 14 గంటలపాటు ప్రశ్నించారని తెలిపారు. కుటుంబ సభ్యులను కలిసేందుకు కూడా తనను అనుమతించలేదన్నారు. తాను పోలీసు కస్టడీలో ఉన్నప్పుడు తనకు ఎలాంటి న్యాయ సహాయం అందలేదన్నారు.
ఉక్రెయిన్‌పై రష్యా దాడిచేయడం ఇష్టం లేకే ఇలా నిరసన తెలిపానని, ఇది తనంత తానే తీసుకున్న నిర్ణయమన్నారు. ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ తనకు నచ్చలేదన్నారు. ఇది నిజంగా చాలా భయంకరమైన విషయమని ఆవేదన వ్యక్తం చేశారు. తానిప్పుడు కఠిన పరిస్థితులు ఎదుర్కొంటున్నట్టు చెప్పారు. ఇప్పటికైతే తనకు విశ్రాంతి కావాలని, ఈ విషయమై మరోమారు మాట్లాడతానని మరీనా వివరించారు.
కాగా, అంతకుముందు కూడా ఆమె ఓ వీడియోను రికార్డు చేసి షేర్ చేశారు. అందులో మరీనా మాట్లాడుతూ.. టెలివిజన్ స్క్రీన్ నుంచి అబద్ధాలు చెబుతున్నందుకు సిగ్గుపడుతున్నానని అన్నారు. రష్యన్లను జాంబీలుగా మార్చేందుకు చేస్తున్న ప్రయత్నంలో తాను కూడా భాగస్వామిని అయినందుకు సిగ్గుగా ఉందని అందులో ఆవేదన వ్యక్తం చేశారు.