కేరళలో మళ్లీ కరోనా కలవరం.. దేశంలోని కేసుల్లో 41% అక్కడే..
-ఇవీ కరోనా కేసుల అప్ డేట్స్
-అరుణాచల్ లో సున్నా కేసులు..
-దేశంలో కొత్తగా 2,876 మందికి మహమ్మారి
-ఒక్క కేరళలోనే 1,193 కేసులు
-యాక్టివ్ కేసులూ అక్కడే ఎక్కువ
-12–14 ఏళ్ల పిల్లలకు మొదలైన వ్యాక్సినేషన్
-60 ఏళ్లు నిండిన అందరికీ ప్రికాషన్ డోసులు
కేసులు కేరళను కలవరపెడుతున్నాయి. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుతున్నా.. అక్కడ పెరుగుతున్నాయి. దేశంలో నమోదవుతున్న కేసుల్లో దాదాపు 41 శాతం కేసులు ఒక్క కేరళలోనే వస్తున్నాయి. నిన్న ఒక్క రోజు దేశవ్యాప్తంగా 2,876 మంది కరోనా బారిన పడితే.. కేరళలోనే 1,193 మందికి పాజిటివ్ వచ్చింది. ఆ రాష్ట్రంలో టెస్ట్ పాజిటివిటీ రేటు 4.34 శాతంగా ఉంది. నిన్న 27,465 టెస్టులు చేశారు. రాష్ట్రంలో మరో 18 మంది కరోనాకు బలయ్యారు.
కొన్ని కారణాలతో గతంలో చనిపోయిన వారి వివరాలను కరోనా మరణాల జాబితాలో చేర్చలేదు. అందులో 54 మందిని తాజాగా ఆ లిస్టులో చేర్చారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 66,958కి పెరిగినట్టయింది. యాక్టివ్ కేసులు 8,064 ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న క్రియాశీల కేసుల్లోనూ కేరళలోనే ఎక్కువుండడం ఆందోళన కలిగించే అంశం.
ఇక, దేశవ్యాప్తంగా కొత్త కేసులతో పోలిస్తే కోలుకున్న వారే ఎక్కువగా ఉన్నారు. కొత్త కేసులు 2,876 అయితే.. 3,884 మంది నిన్న మహమ్మారి బారి నుంచి కోలుకుని ఇంటికి చేరుఉన్నారు. 24 గంటల్లో 98 మంది కరోనాతో చనిపోగా మొత్తం మరణాల సంఖ్య 5,16,072కి చేరింది. దేశంలో కరోనా కేసుల పాజిటివిటీ రేటు ఒకటి కన్నా తక్కువగా ఉంది. నిన్న చేసిన 7,52,818 టెస్టుల్లో 0.38 శాతం మందికే పాజిటివ్ వచ్చింది. యాక్టివ్ కేసులు 32,811గా ఉన్నాయి. ఇప్పటిదాకా మహమ్మారి నుంచి 4,24,50,055 (98.72%) మంది కోలుకున్నారు. 180,60,93,107 (180.60కోట్ల) డోసుల వ్యాక్సిన్ ను వినియోగించారు. కాగా, అరుణాచల్ ప్రదేశ్ లో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. ఆ రాష్ట్రంలో మొత్తంగా ఇప్పటిదాకా 64,483 మంది దాని బారిన పడ్డారు.
కాగా, ఇవాళ్టి నుంచి 12–14 ఏళ్ల పిల్లలకూ కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం మొదలైంది. 60 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ప్రికాషన్ డోసును మొదలు పెట్టారు.