- సమ్మక్క, సారలమ్మలపై చినజీయర్ స్వామి వ్యాఖ్యలు
- క్షమాపణలు చెప్పి తీరాలని ఆందోళనలు
- అప్పటి వరకు ఆందోళనలు కొనసాగుతాయని స్పష్టం
సమ్మక్క, సారలమ్మలపై చినజీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డ పలువురు నేతలు ఆందోళనలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయి. వరంగల్, మహబూబాబాద్, ములుగు జిల్లాలతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల రెండు రోజులుగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు.
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలోనూ ఆందోళనలు జరుగుతున్నాయి. సమ్మక్క, సారలమ్మపై చినజీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలని అమ్మవార్ల భక్తులు డిమాండ్ చేస్తున్నారు. అప్పటి వరకు తమ ఆందోళనలు కొనసాగుతాయని స్పష్టం చేస్తున్నారు.
చినజీయర్ స్వామిపై మండిపడ్డ రేవంత్ రెడ్డి..
- తెలంగాణ పౌరుషం, సంస్కృతికి ప్రతీకలైన “సమ్మక్క సారలమ్మ”
- అమ్మవార్లను అవమానపరిచిన త్రిదండి చినజీయర్
- యాదగిరిగుట్ట ఆగమశాస్త్ర సలహాదారుడి బాధ్యతల నుండి తొలగించాలి
- చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్న రేవంత్ రెడ్డి
సమ్మక్క, సారక్క అమ్మవార్లపై శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతోన్న విషయం తెలిసిందే. కొన్ని రోజులుగా ఇందుకు సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీనిపై చినజీయర్ స్వామి ఇప్పటివరకు స్పందించలేదు. తాజాగా, కాంగ్రెస్ పార్టీ కూడా చినజీయర్ స్వామి వ్యాఖ్యలపై స్పందించింది. ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఓ ట్వీట్ చేశారు. చినజీయర్‌కు కేసీఆర్ గతంలో సాష్టాంగ నమస్కారం చేసిన ఫొటోను రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా పోస్ట్ చేశారు.