శ్రీలంకలో తీవ్ర ఆహార సంక్షోభం… కిలో చికెన్ రూ.1000…
- లంకలో భగ్గుమంటున్న నిత్యావసరాల ధరలు
- కోడిగుడ్డు ధర రూ.35
- ఉల్లిగడ్డలు కేజీ రూ.200
- పాలపొడి డబ్బా రూ.1,945
పొరుగుదేశం శ్రీలంకలో ఆహార, ఆర్థిక సంక్షోభం తీవ్రస్థాయికి చేరింది. గత కొన్నిరోజులుగా కళ్లెం తెంచుకున్న నిత్యావసరాల ధరలు తాజాగా అమాంతం పెరిగిపోయాయి. ప్రస్తుతం శ్రీలంకలో ఒక కోడిగుడ్డు రూ.35 కాగా, కిలో చికెన్ ధర రూ.1000 పలుకుతోంది. కిలో ఉల్లిగడ్డలు రూ.200 కాగా, పాలపొడి రూ.1,945కి చేరింది. లీటర్ పెట్రోల్ రూ.283, లీటర్ డీజిల్ రూ.220గా ఉంది. అటు, డాలర్ తో శ్రీలంక కరెన్సీ విలువ రూ.270కి చేరింది.
ఆర్థిక సంక్షోభం మరింత ముదిరిన నేపథ్యంలో, అక్కడి హోటల్ యాజమాన్యాలు చేతులెత్తాశాయి. దేశంలో 90 శాతం హోటళ్లు మూతపడ్డాయి. దేశంలో ధరల పెరుగుదలపై శ్రీలంక ప్రజలు నిరసన గళం వినిపిస్తున్నారు. శ్రీలంకలో 1990 సంక్షోభం కంటే దారుణ పరిస్థితులు ఏర్పడుతున్నాయని నిపుణులు భావిస్తున్నారు. శ్రీలంకకు ప్రధానంగా పర్యాటకం, ఎగుమతుల ద్వారానే ఆదాయం సమకూరుతుంది. గత రెండున్నరేళ్లుగా కరోనా సంక్షోభం లంకను తీవ్రంగా దెబ్బతీసింది.