జగ్గారెడ్డి దూకుడుకు బ్రేకులు …బాధ్యతల్లో కోతలు!
-రేవంత్‌పై అధిష్ఠానానికి ఫిర్యాదు దిశగా జగ్గారెడ్డి
-జగ్గారెడ్డి బాధ్యతలకు కత్తెరేసిన రేవంత్ రెడ్డి
-అంజన్, అజార్, మహేశ్ గౌడ్‌లకు “కోత”ల బాధ్యతలు
నిత్యం పీసీసీ చీఫ్ పై విమర్శలు గుప్పిస్తన్న ఎమ్మెల్యే జగ్గారెడ్డి పై చర్యలకు ఉపక్రమించారు .ఆయన బాధ్యతల్లో కోతలు విధించారు . నిన్ననే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కి సవాల్ విసిరి , తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా తిరిగి సంగారెడ్డి నుంచి తాను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తా , కాంగ్రెస్ అభ్యర్థిని రేవంత్ పోటీకి నిలిపి గెలిపించుకుంటే ఆయన్ను తాను హీరోగా అంగీకరిస్తానని లేకపోతె జీరో నేనని, దుమ్ముంటే తన సవాల్ స్వీకరించాలని అన్న తూర్పు జయప్రకాశ్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి దూకుడుకు బ్రేకులు వేశారు . పీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ గా ఉన్న జగ్గారెడ్డికి ఇప్పటివరకు ఉన్న బాధ్యతల్లో కోత విధించారు .ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని పీసీసీ పేర్కొన్నది . నిత్యం అసమ్మతి వాదిగా ముద్రపడి ఏఐసీసీ నియమించిన పీసీసీ అధ్యక్షుడిని ఇష్టానుసారం మాట్లాడి కించపరచడాన్ని హైకమాండ్ కూడా అంగీకరించలేదని సమాచారం . ఏఐసీసీ సలహామేరకు రేవంత్ జగ్గారెడ్డి పై చర్యలకు ఉపక్రమించినట్లు పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ లో ఉంటూ పార్టీని నాయకత్వాన్ని తులనాడుతూ నష్టపరిచే విదంగా వ్యవహరిస్తే వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని సంకేతాలు ఇచ్చినట్లు అయింది.
టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా దూకుడు ప్రదర్శిస్తున్న టీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి (జగ్గారెడ్డి)కి సోమవారం షాక్ తగిలింది. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఆయనకు కట్టబెట్టిన బాధ్యతలపై కోతను విధిస్తూ టీపీసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఆయనకు అప్పగించిన పార్లమెంట్ నియోజకవర్గాల బాధ్యతలు, అనుబంధ సంఘాల బాధ్యతల నుంచి ఆయనను తప్పించేసింది.
ఇక జగ్గారెడ్డి నుంచి తొలగించిన బాధ్యతలను కొత్తగా అంజన్ కుమార్ యాదవ్, మహ్మద్ అజారుద్దీన్, మహేశ్ గౌడ్‌లకు అప్పగిస్తూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. రేవంత్‌పై అధిష్ఠానానికి ఫిర్యాదు చేసే దిశగా కదులుతున్న జగ్గారెడ్డికి బ్రేకులేయడమే లక్ష్యంగా ఈ చర్యలు తీసుకున్నట్లుగా సమాచారం. ఈ చర్యలపై జగ్గారెడ్డి స్పందన ఎలా ఉంటుందన్నది చూడాలి!