పాలేరు ను కందాల కంచు కోట చేసుకోగలడా ?
-పార్టీ మార్పు ఆయనకు మైనస్ గా మారనుందా ??
-మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన కందాల మార్క్ ఏమిటి ???
-పాలేరు ప్రజల్లో సుస్థిర స్తానం కోసం ఆయన చేస్తున్న కృషి ఫలిస్తుందా ????
-నియోజకవర్గంలో చనిపోయిన ప్రతికుటుంబానికి 10 వేల సహాయం
-దానధర్మాలు ఆయనకు కలిసొస్తాయా ?
కందాల ఉపేందర్ రెడ్డి పాలేరు ఎమ్మెల్యే ….క్లిన్ ఇమేజ్ ఉన్న నాయకుడిగా గుర్తింపు ఉంది.మొదటిసారిగా పోటీచేసి రాజకీయాల్లో ఉద్దంఢుడైన మాజీమంత్రి తుమ్మలను ఓడించిన చరిత్ర ఉంది. పాలేరు నియోజకవర్గాన్ని తన కంచుకోటగా చేసుకోవాలని వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు అదిసాధ్యం అవుతుందా ? అనేది ఇప్పుడు ఆశక్తిగా మారింది. కాంగ్రెస్ లో గెలిచి టీఆర్ యస్ లోకి పోవడం అనేది ఆయనకు మైనస్ గా మారనున్నదా? అనే చర్చకూడ జరుగుతుంది. నియోజకవర్గంలో తనమార్క్ కోసం ఆయన తాపత్రయపడుతున్నారు కానీ నిధుల కొరత ఆయన్ను వెంటాడుతుంది.
పార్టీ ఏదైనా సహాయం కోసం ఆయన దగ్గరకు వెళ్లిన వాళ్లకు నో అని చెప్పే మనస్తత్వం కాదని అంటారు . ఉమ్మడి రాష్ట్రంలో పాలేరు నుంచి పోటీకోసం రెండు పర్యాయాలు ప్రయత్నించారు. ఆయనకే టికెట్ అనుకున్న తరుణంలో సీనియర్ నేత రామిరెడ్డి వెంకటరెడ్డి కి కాంగ్రెస్ టికెట్ ఇవ్వడంతో ఆయన వెనక్కు తగ్గాల్సి వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరవాత 2018 లో మొదటిసారిగా పోటీచేసినప్పటికీ సీనియర్ రాజకీయనేత , మాజీమంత్రి తుమ్మలను ఓడించి రాష్ట్ర శాసనసభలో అడుగు పెట్టారు . కాకపోతే ఒక మైనస్ ఆయనను వెంటాడుతుంది. కాంగ్రెస్ నుంచి పోటీచేసి ఆ పార్టీకి గుడ్ బై చెప్పి అధికార టీఆర్ యస్ లో చేరడం చాలామందికి నచ్చలేదు … కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన ఆయన గెలుపుకోసం కృషిచేసిన వాళ్ళు ఆయన నిర్ణయాన్ని జీర్ణించుకోలేకపోయారు . కందాల పెద్దగా మాటలు చెప్పకపోయినా ప్రజల్లో ఆయనపట్ల ప్రత్యేక ఇమేజ్ ఏర్పరుచుకున్నారు . పార్టీ మార్పు పై ప్రతివాళ్ళు చెప్పినట్లే ఆయనకూడా నియోజకవర్గ అభివృధ్ధికోసం చేరానని చెపుతారు .
నిరంతరం నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటారనే పేరుంది . మొదటి సరిగా ఎన్నికైనప్పటికీ అధికారులతో మెలిగే తీరు ,వారితో పనిచేయించుకొనే స్వభావం ఆయనకు ప్లస్ గా మారింది. నియోజకవర్గాన్ని త్వరగానే ఆకళింపు చేసుకున్నారు .నియోజకవర్గంలో సమస్యలపై పూర్తీ అవగాహనా కలిగి ఉన్నారు . ఎక్కడ ఎవరికీ ఏ కష్టం వచ్చిన నేను ఉన్నాననే ధైర్యాన్ని ఇచ్చే ఎమ్మెల్యేగా పేరుతెచ్చుకున్నారు . నియోజకవర్గంలో చనిపోయిన ప్రతి కుటుంబానికి 10 వేల రూపాయలు అందించడం ఆయన ప్రత్యేకతగా చెప్పవచ్చు . ఇందుకు ప్రతిమండలంలో ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటు చేశారు . ఆయన ఎక్కడ ఉన్న ఆయన తరుపున చనిపోయిన వారి ఇంటికివెళ్ళి 10 వేల రూపాయలు అందించడం బహుశా దేశంలోనే ఎక్కడ లేదేమో ! ఇప్పటికే కోట్ల రూపాయలు ఆయన సహాయంగా అందించారని పేరు తెచ్చుకున్నారు .
దాన ధర్మాలలో ఆయనకు ఆయనేసాటి …
ఎమ్మెల్యే కందాల దానధర్మాలను చేయడంలో దిట్ట . గుళ్ళు, బళ్ళు,మసీద్ లు , చర్చ్ లు యువకులకు క్రీడా పరికరాలు , లాంటి వాటి కోసం ఎవరొచ్చినా లేదు కాదు అనే స్వభావం కాదు కందాల ది . ఆయన ఎమ్మెల్యే కాకముందే నేలకొండపల్లి మండలంలోని ఒక గ్రామానికి చెందిన కొందరు హైద్రాబాద్ లో ఆయన సహాయం కోసం వెళ్లారు . విషయం చెప్పారు . మారు మాట్లాడకుండా ఆయన ఇంట్లోకి వెళ్లి వచ్చిన వారు అనుకున్న దానికన్నా ఎక్కువగా ఇచ్చి దారిఖర్చులకు అదనంగా ఇచ్చి ఆదరించిన మహానుభావుడు అని ఆగ్రామాస్తులు అంటారు .దానధర్మాలు చేయడంలో ఆయనకు ఆయనేసాటి అనే పేరుంది.
అయితే ఆయనకు ప్రజల్లో చెడ్డపేరు లేదు … ప్రజలను సరిగా గుర్తుపట్టడని,ఆయన దగ్గరకు వెళ్లిన ప్రతిసారి తాను ఎవరు అనేది పరిచయం చేసుకోవాల్సి వస్తుందనే విమర్శ ఉంది. నియోజవర్గ అభివృద్ధి కి నిధులు రాకపోవడం, అభివృద్ధి పరుగులు పెట్టకపోవడం పై చర్చ జరుగుతుంది. దీన్ని ఆయన ఎలా అధిగమిస్తారో చూడాలి మరి !