Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

జగన్ కేబినెట్ లో ఇద్దరు మినహా అందరూ ఔట్ : కొత్త మంత్రులుగా వీరికే ఛాన్స్..!!

జగన్ కేబినెట్ లోని ప్రస్తుత మంత్రుల్లో కొనసాగెదెవరు. ఈ అంశం పైన క్లారిటీ వచ్చేసింది. ఏపీలో మంత్రివర్గ ప్రక్షాళన ఇప్పుడు అధికార పార్టీ నేతల్లో ఉత్కంఠ రేపుతోంది. ప్రస్తుత మంత్రుల్లో ఉండేదెవరు.. పోయేదేవరు అనే అంశం పైన పార్టీలో జోరుగా చర్చ సాగుతోంది. అదే సమయంలో సీఎం జగన్ కొత్తగా ఎవరికి అవకాశం ఇస్తారనే అంశం పైన ఎవరి అంచనాల్లో వారు ఉన్నారు.

ఏప్రిల్ 11న కేబినెట్ విస్తరణ దాదాపు ఖాయం అయినట్లు తెలుస్తోంది. ఉగాది నుంచి కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభం కానుండటంతో.. మంత్రివర్గ విస్తరణ సైతం త్వరగా పూర్తి చేసి..ఇక పార్టీ – ప్రభుత్వంలో వచ్చే ఎన్నికల దిశగా అడుగులు వేయాలని సీఎం జగన్ భావిస్తున్నారు. అందులో భాగంగా.. ఊహించని విధంగా ఈ విస్తరణ కూర్పు విషయంలో జగన్ కొత్త సమీకరణాలు తీసుకొస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.

ప్రస్తుత కేబినెట్ లో ఇద్దరు మంత్రులు మిగిలిన వారందరినీ తప్పించాలని నిర్ణయించారు. పూర్తిగా సామాజిక సమీకరణాల ఆధారంగానే ఈ సారి కేబినెట్ విస్తరణ జరగనుంది. అదే సమయంలో కొత్త జిల్లాల ఏర్పాటుతో ప్రాంతీయ సమీకరణాలను పరిగణలోకి తీసుకుంటున్నారు. రెడ్డి సామాజిక వర్గానికి ప్రస్తుతం ఉన్న నాలుగు పదవుల నుంచి మూడుకు తగ్గనుంది. కాపు వర్గం నుంచి నలుగురికి ఛాన్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

అందులో భాగంగా.. ఇప్పటికే పిల్లి సుభాష్ చంద్రబోస్ ను రాజ్యసభకు పంపిన జగన్..ఆ స్థానంలో అదే వర్గానికి చెందిన చెల్లుబోయిన వేణు గోపాల క్రిష్ణకు కేబినెట్ లో స్థానం కల్పించారు. ఇప్పుడు వేణును సైతం కొనసాగించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. సీనియర్లను కొనసాగిస్తారనే ప్రచారం నడుమ.. ఈ ఇద్దరు మినహా..మిగిలిన వారిని మొత్తంగా తప్పించాలని డిసైడ్ అయ్యారని తెలుస్తోంది.

ఇక, ఈ సారి మహిళలకు అయిదు స్థానాలు ఇవ్వనున్నారు. రెడ్డి వర్గానికి మూడుకు తగ్గనుంది. ఆ మూడు స్థానాల్లో చిత్తూరు నుంచి రోజా.. కర్నూలు నుంచి శిల్పా చక్రపాణి రెడ్డి.. నెల్లూరు నుంచి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్లు ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

కాపు వర్గం నుంచి నలుగురిలో విశాఖ నుంచి గుడివాడ అమర్నాధ్.. తూర్పు గోదావరి నుంచి దాడిశెట్టి రాజా.. పశ్చిమ గోదావరి నుంచి గ్రంధి శ్రీనివాస్.. గుంటూరు జిల్లా నుంచి అంబటి రాంబాబు లేదా క్రిష్నా జిల్లా నుంచి సామినేని ఉదయభాను పేర్లు తుది పరిశీలనలో ఉన్నాయని సమాచారం. మైనార్టీ వర్గం నుంచి కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ పేరు పరిశీలనలో ఉంది.

ఎస్టీ వర్గం నుంచి స్పీకర్ గా రాజన్న దొర కు ఇవ్వాలని భావిస్తున్నారు. అది సాధ్యపడకుండే.. మంత్రిగా పరిశీలించే అవకాశం ఉంది. క్షత్రియ వర్గం నుంచి ప్రసాద రాజుకు ఖాయంగా కనిపిస్తోంది. వైశ్య వర్గం నుంచి కోలగొట్ల వీరభద్రస్వామికి అవకాశం ఉంది. కమ్మ వర్గం నుంచి వసంత క్రిష్ణప్రసాద్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.

అదే విధంగా ధర్మాన ప్రసాద రావు, తమ్మినేని సీతారాం.. కొలుసు పార్ధసారధి.. పాన్నాడ సతీష్ కుమార్.. విడదల రజనీ.. ఉషశ్రీ చరణ్.. తలారి వెంకటరావు.. మేరుగ నాగార్జున.. గూడూరు ఎమ్మెల్యే వరప్రసాదరావు.. పేర్లు ఇప్పటి వరకు తుది రేసులో వినిపిస్తున్నాయి. అయితే, ఎమ్మెల్సీలకు ఈ విస్తరణలో ఛాన్స్ ఉంటుందా లేదా అనే దాని పైన చర్చ సాగుతోంది. ఎమ్మెల్సీలకు ఛాన్స్ ఇవ్వాలని భావిస్తే.. గుంటూరు – తూర్పు గోదావరి జిల్లాల్లో ప్రాధాన్యత దక్కే అవకాశం కనిపిస్తోంది.

ఇక, ఉగాది సాయంత్రం సీఎం జగన్ ప్రస్తుత మంత్రులకు విందు ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఆ సమయంలోనే వారికి కేబినెట్ విస్తరణ గురించి అధికారికంగా వెల్లడించే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. దీంతో.. జగన్ కేబినెట్ లో ఎవరికి ఛాన్స్ దక్కనుందనే అంశం పైన ఇప్పుడు ఆశావాహుల్లో ఉత్కంఠ పెరిగిపోతోంది.

Related posts

వాణిజ్య గ్యాస్ సిలిండర్‌ ధర పెంపు

Drukpadam

రాజకీయ లబ్ది కోసమే జెడి లక్ష్మీనారాయణ పిటిషన్ :కేంద్రం కౌంటర్ అఫిడవిట్!

Drukpadam

జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాల్సిందే …వారికీ సిపిఎం అండగా ఉంటుంది :నున్నా నాగేశ్వరరావు!

Drukpadam

Leave a Comment