Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

అడ్డగోలుగా భూసేకరణ చేయోద్దు: పాదయాత్రలో భట్టి విక్రమార్క!

అడ్డగోలుగా భూసేకరణ చేయోద్దు: పాదయాత్రలో భట్టి విక్రమార్క!
-ప్రేమపూర్వకంగా రైతులను ఒప్పించి ,మెప్పించి భూసేకరణ చేయాలి
-2013 భూసేకరణ చట్టం ద్వారానే భూములు తీసుకోవాలి
-బలవంతపు భూసేకరణ చేస్తే అడ్డుకుంటాం
-ధరల నియంత్రణ చట్టాన్ని తొలగించిన మోడీ
-కృత్రిమ కొరత సృష్టించి దోచుకుంటున్న కార్పొరేట్లు
-మాట నిలబెట్టుకున్న నీళ్లు పారించా..”

రోడ్డు విస్తరణ పేరిట అడ్డగోలుగా భూసేకరణ జరిపిన, రైతుల నుంచి బలవంతంగా భూమి సేకరించిన ఊరుకునే ప్రసక్తేలేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రజా సమస్యల పరిష్కారంపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు చేపట్టిన పీపుల్స్ మార్చ్ సోమవారం చింతకాని మండలం కొదుమూరు నుంచి వందనం, రాఘవపురం, లచ్చగూడెం, నేరడ గ్రామాల్లో కొనసాగింది. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ప్రజలను పలకరిస్తూ వారి సమస్యలు తెలుసుకుంటూ అభివాదం చేస్తూ భట్టి విక్రమార్క పాదయాత్ర సాగింది . ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లోని ముఖ్యమంత్రులు స్వర్గీయ నందమూరి తారక రామారావు, డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన సభలలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. తల్లితో పెనవేసుకున్న అనుబంధం వలె భూమిని నమ్ముకున్న ప్రజలకు దానితో విడదీయలేని బంధం ఉంటుందన్న విషయాన్ని పాలకులు గ్రహించి రైతులను ఒప్పించి మెప్పించి ప్రేమపూర్వకంగా భూసేకరణ చేయాలన్నారు. బెదిరింపులు చేసి బలవంతంగా గుంజుకోవాలని చూస్తే మధిర నియోజకవర్గంలో వారి ఆటలు సాగనివ్వనని వెల్లడించారు. గ్రీన్ ఫీల్డ్, అమరావతి- పూనా రోడ్స్ ఏర్పాటు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన 2013 భూ సేకరణ చట్టం ప్రకారం గా భూములు సేకరించాలని ప్రభుత్వానికి సూచించారు. ప్రస్తుతం ఉన్న మార్కెట్ ధరలకు మూడు రెట్లు ఎక్కువ ధర చెల్లించి రైతుల అంగీకారంతో భూ సేకరణ చేయాలని అధికారులకు సూచించారు. అడ్డగోలుగా భూసేకరణ చేస్తే కచ్చితంగా తాను ప్రజల పక్షాన ముందుండి అడ్డుకుంటానని వెల్లడించారు. పారదర్శకంగా 2013 భూ సేకరణ చట్టం ప్రకారంగా నిర్వాసితులకు పరిహారం ఇవ్వాలని చీఫ్ సెక్రటరీ దృష్టికి తీసుకువెళ్లాలని తెలిపారు.

ధరల నియంత్రణ చట్టాన్ని తొలగించి ప్రధాని మోడీ కార్పొరేట్ శక్తుల దోపిడికి తెరలేపారని విమర్శించారు. అంబానీ ఆధానీల కోసం మోడీ సర్కార్ స్వేచ్ఛా మార్కెట్ పేరిట ధరల నియంత్రణ చట్టాన్ని తొలగించడంతో నిత్యావసర వస్తువుల కృత్రిమ కొరత సృష్టించి కార్పొరేట్ శక్తులు ధరలు పెంచి ప్రజల రక్తాన్ని జలగల్లా పీలుస్తున్నారని ధ్వజ మెత్తారు. 2 నెలల క్రితం 90 రూపాయల కిలో ఉన్న పామాయిల్ ప్యాకెట్ ధర ఇప్పుడు 220 రూపాయలకి ఎగబాకిన పాలకులు పట్టనట్టుగా ఉండడం సిగ్గుచేటుగా ఉందన్నారు. కృత్రిమ కొరత సృష్టించి గోదాముల్లో సరుకులను దాస్తున్న కార్పోరేట్ శక్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికార యంత్రాంగం వెంటనే గోదాముల పై దాడులు నిర్వహించి వ్యాపారులు దాచిపెట్టిన సరుకులను బయటకు తీయాలని సూచించారు. రాష్ట్రంలో నేడు మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోవడానికి నకిలీ విత్తనాలు కారణమన్నారు. నకిలీ విత్తనాలు విక్రయించడం హత్య చేయడం కంటే ఎక్కువన్న విషయాన్ని పాలకులు గ్రహించాలన్నారు. నకిలీ విత్తనాలు తామర పురుగు తో మిర్చి రైతులు తీవ్రంగా నష్టపోయిన విషయాన్ని అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లానని అన్నారు . ఫలితంగా ప్రభుత్వం అధికారులను వ్యవసాయ క్షేత్రాలకు పంపించి పరిహారం ఇప్పిస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా రైతులకు గుర్తు చేశారు.

“మాట నిలబెట్టుకున్న నీళ్లు పారించా..” భట్టి

చింతకాని మండలం కోదుమూరు, వందనం రాఘవాపురం గ్రామాలకు సాగు తాగునీరు ఇస్తానని మాట ఇచ్చి నిలబెట్టుకున్నాని పునరుద్ఘాటించారు. నాడు రక్తం పారిన నేలలో నేడు భగీరథుని పరుగులు పెట్టించి బీడు భూములను పచ్చని పంట పొలాలుగా మార్చి సస్యశ్యామలం చేశానని గుర్తు చేశారు. సాంకేతికంగా అనేక అవాంతరాలు ఉన్నప్పటికీ ప్రభుత్వ రూల్స్ ను సవరణ చేయించి రామలింగేశ్వర స్వామి చెరువు ఫీల్డ్ డ్రాప్ ఏర్పాటు చేశామని వివరించారు. నాగార్జున సాగర్ నీళ్లు పంట పొలాల్లోకి రావడంతో రైతుల ముఖాల్లో సంతోషం వెల్లివిరిసింది అన్నారు. రైతుల సంతోషం చూసిన తర్వాత ఈ ప్రాజెక్టు కోసం తాను పడిన శ్రమను మర్చిపోయానని తెలిపారు. నాడు త్రాగడానికి నీటి ఎద్దడిని ఎదురుక్కున్న గ్రామాలు నేడు పచ్చని పంటలతో కళకళలాడటం చూసి ఆనందంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు . రాఘవపురం ప్రజల కోరిక మేరకు చెరువును మినీ ట్యాంకుబండ్ గా అభివృద్ధి చేయించడంతో పాటు పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దడానికి తన వంతు కృషి చేస్తానని ప్రకటించారు. రాఘవ పురం గ్రామానికి గ్రామ పంచాయతీ భవనం మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు.

అయ్యా….పింఛన్ ఇప్పించు
సీఎల్పీ నేత భట్టిని వేడుకున్న వృద్ధురాలు

చింతకాని మండలం కోదుమూరు గ్రామంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర చేస్తున్న సందర్భంగా మధిర మండలం రొంపిమల్ల గ్రామానికి చెందిన పోతగాని అచ్చమ్మ, రాములు దంపతులు ఎదురొచ్చి తమకు ప్రతి నెల వచ్చే వృద్ధాప్య పింఛను ఇవ్వకుండా మధిర ఎస్బిఐ బ్యాంకు అధికారులు నిలిపివేశారని చెప్పారు. వృద్ధాప్యంలో ఉన్న తమకు మందులు కొనుక్కోడానికి ఇబ్బంది అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఫించన్ ఇప్పించాలని వేడుకోగా బ్యాంకు మేనేజర్ తో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని భట్టి విక్రమార్క ఆ వృద్ధ దంపతులకు హామీఇచ్చారు. వీరి మాదిరిగానే మరొక రైతు రుణమాఫీ చేయించాలని, ఇంకొక రైతు బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించాలని, నిరుపేదలు తమకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇప్పించాలని ప్రజలు వేడుకున్నారు.

 

Related posts

ఆ ప‌త్రిక సారీ చేప్పేదాకా వ‌దిలేదు లేదు: నారా లోకేశ్!

Drukpadam

కేంద్రంతో కేసీఆర్ లొల్లి ఓ డ్రామా… రేవంత్

Drukpadam

ఉక్కే కదా…? అనుకుంటే తుక్కు రేగుతుంది.

Drukpadam

Leave a Comment