Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కొత్త జిల్లాలను వసతులు, సదుపాయాలు లేకుండా ఏర్పాటు చేస్తే ఎలా?: జీవీఎల్ మెలిక!

కొత్త జిల్లాలను వసతులు, సదుపాయాలు లేకుండా ఏర్పాటు చేస్తే ఎలా?: జీవీఎల్ మెలిక!
-అమరావతి తరహాలో కొత్త జిల్లాలను చేయకూడ‌దు
-కొత్త జిల్లాల ఏర్పాటు అసంబద్ధంగా జరిగింది
-నిధులు లేకుండా విధులు ఎలా?
-జిల్లా కేంద్రాలకు, మండల కేంద్రాలకు కనెక్టివిటీ పెంచాలి

కొత్త జిల్లాల ఏర్పాటుపై ఏపీ ప్రభుత్వం తుది నోటిఫికేషన్ జారీ చేసిన విష‌యం తెలిసిందే. దీనిపై బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు స్పందించారు. ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటును స్వాగతిస్తున్నామ‌ని చెప్పారు. అయితే, కొత్త జిల్లాలను వసతులు, సదుపాయాలు లేకుండా ఏర్పాటు చేస్తే ఎలాగ‌ని ఆయ‌న నిల‌దీశారు. అమరావతి తరహాలో కొత్త జిల్లాలను చేయకూడ‌ద‌ని ఆయ‌న చెప్పారు. దీనిపై నాడు ఎలాంటి సౌకర్యాలు లేకుండా రాష్ట్రరాజధాని తరలింపును బీజేపీ ఎందుకు వ్యతిరేకించలేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సద్విమర్శ చేయడంలో తప్పులేదుకని ప్రతిదాన్ని రంద్రాన్వేషణ చేయడం ఏమిటనే ప్రశ్నలు వస్తున్నాయి.

అమరావతి అభివృద్ధికి నిధులివ్వాలని కేంద్ర ప్ర‌భుత్వాన్ని రాష్ట్ర ప్ర‌భుత్వం ఎందుకు అడగడంలేదని జివిఎల్ ప్ర‌శ్నించారు. ఏపీలో 26 జిల్లాలు ఏర్పాటు చేస్తామని తాము 2019 ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నామ‌ని ఆయ‌న చెప్పారు. ఇప్పుడు కొత్త జిల్లాల ఏర్పాటు అసంబద్ధంగా జరిగిందని అన్నారు.

నిధులు లేకుండా ఈ కొత్త జిల్లాల్లో విధులు ఎలా నిర్వ‌హిస్తార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఒక్కో జిల్లాకు కనీసం రూ.100 కోట్ల నిధులను ఎందుకు కేటాయించ‌లేద‌ని ఆయ‌న నిల‌దీశారు. ఏపీ స‌ర్కారు కొత్త జిల్లాల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే జిల్లాల పరిస్థితి నిర్వీర్యం అవుతుందని ఆయ‌న చెప్పారు.

మౌలిక‌ వసతులు ఏర్పాట్లు చేయకుండా కొత్త జిల్లాలను ఎలా ఏర్పాటు చేస్తారని ఆయ‌న నిల‌దీశారు. జిల్లా కేంద్రాలకు, మండల కేంద్రాలకు కనెక్టివిటీ పెంచాలని ఆయ‌న అన్నారు. అమరావతిపై హైకోర్టు ఇచ్చిన‌ ఆదేశాలను ధిక్కరించేలా ఏపీ ప్రభుత్వం వ్యవహరించడం సరైన పద్ధతి కాదని ఆయ‌న అన్నారు. అమరావతికి నిధులు ఇవ్వకుండా రైతులకు అన్యాయం చేయాలని చూస్తున్నార‌ని ఆయ‌న చెప్పారు.

అమ‌రావ‌తిలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు గ‌త‌ టీడీపీ ప్రభుత్వం భూములు కేటాయించింద‌ని, ఇప్పుడు ఆ ప్రాంతంలో కనీసం మౌలిక వసతుల కోసమైనా వైసీపీ ప్రభుత్వం ముందుకు రావడం లేదని ఆయ‌న అన్నారు. ఏపీ రాజధాని విషయంలో స్పష్టత ఇవ్వకపోవడం వ‌ల్లే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు అమరావతిలో కార్యాల‌యాలు నెల‌కొల్ప‌డానికి ఆస‌క్తి క‌న‌బ‌ర్చ‌డం లేద‌ని ఆయ‌న అన్నారు. అమరావతికి కేంద్ర స‌ర్కారు స‌హ‌క‌రించడానికి సిద్ధంగానే ఉన్నప్ప‌టికీ వైసీపీ ప్రభుత్వమే ముందుకు రావడం లేదని ఆయ‌న ఆరోపించారు.

Related posts

కేసీఆరా మజాకానా ….600 కార్లు, మంది మార్బలంతో మహారాష్ట్రకు…!

Drukpadam

షర్మిల కేసీఆర్ సర్కారుపై ఒంటరి పోరాటం …

Drukpadam

రాజకీయాలపై సంచలనం రేపుతున్న మంత్రి రోజా వ్యాఖ్యలు !

Drukpadam

Leave a Comment