ఏపీ ప్రభుత్వంపై తెలంగాణ మంత్రి ఘాటు వ్యాఖ్యలు!
- సాగర్ జలాలపై కృష్ణా బోర్డుకు ఏపీ ఫిర్యాదు
- ఏపీ ఫిర్యాదుపై స్పందించిన తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి
- ఏపీ ప్రభుత్వం తన గౌరవాన్ని దిగజార్చుకుంటోందని కామెంట్
ఏపీ ప్రభుత్వంపై తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి మంగళవారం ఘాటు వ్యాఖ్యలు చేశారు. నాగార్జున సాగర్ నీటి వినియోగానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వంపై ఏపీ ప్రభుత్వం కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేయడంపై ఆయన మంగళవారం స్పందించారు. ఏపీ ప్రభుత్వం చేసిన ఈ ఫిర్యాదుకు అసలు అర్థమే లేదని ఆయన వ్యాఖ్యానించారు. సాగర్ జలాలను వినియోగించి తెలంగాణ విద్యుదుత్పత్తి చేస్తుందనడంలో ఎలాంటి వాస్తవం లేదని కూడా మంత్రి పేర్కొన్నారు.
అసంబద్ధ ఆరోపణలతో ఏపీ ప్రభుత్వం తన గౌరవాన్ని దిగజార్చుకుంటోందని కూడా జగదీశ్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణకు కూడా తాగు నీటి అవసరాలు ఉన్నాయన్న మంత్రి.. పవర్ గ్రిడ్‌ను కాపాడుకునేందుకు 5 నుంచి 10 నిమిషాలకు మించి నీటిని వాడుకోవడం లేదని వివరించారు. శ్రీశైలం నుంచి తెలంగాణ విద్యుదుత్పత్తిని ఆపేసినా.. ఏపీ మాత్రం ఇప్పటికీ విద్యుదుత్పత్తిని కొనసాగిస్తోందని జగదీశ్ రెడ్డి ఆరోపించారు.