ఢిల్లీ నుంచి రాగానే గవర్నర్‌తో జగన్ భేటీ!
- బుధవారం మధ్యాహ్నం దాకా ఢిల్లీలోనే జగన్
- విజయవాడకు చేరుకున్న మరుక్షణమే రాజ్ భవన్‌కు పయనం
- మంత్రివర్గ పునర్వవస్థీకరణపై చర్చ జరిగే అవకాశం
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌తో భేటీ కానున్నారు. బుధవారం సాయంత్రం 6 గంటలకు విజయవాడలోని రాజ్ భవన్‌కు వెళ్లనున్న జగన్… గవర్నర్‌తో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఈ భేటీలో త్వరలో జరగనున్న మంత్రివర్గ పునర్వవస్థీకరణ గురించి గవర్నర్‌కు జగన్ వివరించే అవకాశాలున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
మంగళవారం ఢిల్లీ పర్యటనకు వెళ్లిన జగన్.. రాత్రి దాకా బిజీబిజీగా గడిపారు. ప్రధాని నరేంద్ర మోదీతో భేటీతో మొదలుపెట్టిన జగన్..వరుసగా కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, గజేంద్ర సింగ్ షెకావత్‌లతో భేటీ అయ్యారు. ఆ తర్వాత రాత్రి 9.30 గంటల సమయంలో కేంద్ర హోం శాఖ మంత్రితోనూ జగన్ భేటీ అయ్యారు.
ఇక బుధవారం కూడా ఢిల్లీలోనే ఉండనున్న జగన్.. బుధవారం మధ్యాహ్నానికి గానీ తన ఢిల్లీ పర్యటనను ముగించుకుని విజయవాడకు తిరుగు ప్రయాణం అయ్యే అవకాశాలు లేవు. బుధవారం కూడా జగన్ పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యే అవకాశాలున్నాయి. ఢిల్లీ నుంచి విజయవాడ రాగానే జగన్ రాజ్ భవన్‌కు వెళ్లనున్నారు. ఢిల్లీ పర్యటనను ముగించుకున్న మరుక్షణమే గవర్నర్‌తో జగన్ భేటీ అవుతున్నారంటే.. ఏదో కీలక అంశమే అయి ఉంటుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.