పోలీస్ స్టేషన్‌కు చేరిన ఇద్దరు యువకుల పెళ్లి.. రూ. 10 వేలతో కథ సుఖాంతం!
- మెదక్ జిల్లాలో ఘటన
- తాగిన మైకంలో తాళి కట్టించుకున్న యువకుడు
- ఆపై కాపురానికి వచ్చానంటూ యువకుడి ఇంటికి
- గ్రామస్థులు, ఇరు కుటుంబాల వారితో చర్చించి సమస్యను పరిష్కరించిన పోలీసులు
తాగిన మైకంలో ఇద్దరు యువకులు చేసుకున్న పెళ్లి చివరికి పోలీస్ స్టేషన్‌కు చేరింది. ఆపై రూ. 10 వేలు చెల్లించడంతో కథ సుఖాంతమైంది. అసలు విషయంలోకి వెళ్తే.. సంగారెడ్డి జిల్లా జోగిపేటకు చెందిన 21 ఏళ్ల యువకుడికి, మెదక్ జిల్లా చిలప్‌చేడ్ మండలం చండూరుకు చెందిన 22 ఏళ్ల ఆటోడ్రైవర్‌కు ఓ కల్లు దుకాణంలో పరిచయం ఏర్పడింది. ఈ నెల 1న తాగిన మైకంలో చండూరు యువకుడితో జోగిపేట యువకుడు తాళి కట్టించుకున్నాడు. అక్కడి వరకు బాగానే ఉన్నా, ఆ తర్వాత అసలు కథ మొదలైంది.
కాపురానికి వచ్చానంటూ తాళి కట్టించుకున్న యువకుడు.. దానిని కట్టిన యువకుడి ఇంటికి రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఇంటికి వచ్చిన యువకుడిని తాళి కట్టిన యువకుడి తల్లిదండ్రులు మందలించి పంపేశారు. దీంతో అతడు నేరుగా వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
దీంతో సీన్ పోలీస్ స్టేషన్‌కు మారింది. గ్రామ పెద్దలు, ఇద్దరు యువకుల కుటుంబ సభ్యులను పిలిపించి పోలీసులు చర్చించారు. అయితే, లక్ష రూపాయలు ఇస్తేనే కేసు వాపసు తీసుకుంటానని తాళి కట్టించుకున్న యువకుడు తేల్చి చెప్పాడు. చివరికి అతడిని ఎలాగోలా రూ. 10 వేలకు ఒప్పించడంతో అతడు కేసు వాపసు తీసుకున్నాడు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.