ఎమోషన్‌కు గురైన మాట వాస్తవమే కానీ అవాస్తవమన్న మేకతోటి సుచరిత!
-రాజీనామా అవాస్తవమన్న సుచరిత
-థ్యాంక్స్ గివింగ్ లెటర్‌ను కుమార్తె తప్పుగా అర్థం చేసుకుందని వెల్లడి
-రాజీనామా సమస్యే లేదన్న మాజీ హోం మంత్రి
-తాడేపల్లిలో సీఎం జగన్‌తో గంటన్నరకు పైగా భేటీ
తనకు తిరిగి పదవి ఇవ్వలేదని అలక బూనిన మాజీ హోమ్ మంత్రి మేకతోటి సుచరిత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆమె కుమార్తె ప్రకటించిన సంగతి విదితమే .పార్టీ నేత రాజ్యసభ సభ్యులు మేపిదేవి వెంకట రమణ స్వయంగా సుచరిత ఇంటికి వెళ్లి నచ్చచెప్పినా ఆమె వినలేదు .. పైగా తాను ఎమ్మెల్యేగా కూడా కొనసాగలేనని చెప్పారు . మూడురోజులుగా ఆమె కోసం ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి ఫోన్ చేసిన స్పందన లేదు .దీంతో ఆమె రాజీనామా విషయంలో వెనక్కు తగ్గదని అనుకున్నారు . ఆమెను ఇక బుజ్జగించేది లేదనికూడా పార్టీ భావించింది. అయితే ఆమె స్వయంగా తాడేపల్లి లోని సీఎం నివాసానికి వచ్చి జగన్ కలిసి తన రాజీనామా ఉత్తిత్తిదే అని చెప్పారు .తాను మీ వెంటే నడుస్తానానికి కూడా తెలిపారు . దీంతో సుచరిత ఎపిసోడ్ కు తెరపడింది.
ఏపీ మంత్రివర్గ పునర్వవస్థీకరణ నేపథ్యంలో అలకబూనిన రాష్ట్ర హోం శాఖ మాజీ మంత్రి మేకతోటి సుచరిత కాసేపటి క్రితం అలక వీడారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చిన ఆమె సీఎం జగన్‌తో గంటన్నరకు పైగా భేటీ అయ్యారు. ఆ తర్వాత ఆమె అక్కడే మీడియాతో మాట్టాడారు. తన అలక, ఎమ్మెల్యే పదవికి రాజీనామా అంటూ జరిగిన ప్రచారంపై ఆమె స్పందించారు.
ఈ సందర్భంగా ఆమె పలు కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రివర్గ పునర్వవస్థీకరణలో పదవిని ఆశించిన నేపథ్యంలో పదవి దక్కకపోవడంతో చిన్నపాటి ఎమోషన్‌కు గురైన మాట వాస్తవమేనని ఆమె చెప్పారు. మంత్రివర్గ పునర్వవస్థీకరణ సందర్భంగా థ్యాంక్స్ గివింగ్ లెటర్ రాశానని, దానినే తన కుమార్తె తప్పుగా అర్థం చేసుకుని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్టుగా చెప్పిందని పేర్కొన్నారు. రాజీనామా అన్న ప్రశ్నే ఉత్పన్నం కాలేదని ఆమె చెప్పుకొచ్చారు.
రాజకీయాల నుంచి నుంచి తప్పుకోవాల్సి వస్తే.. వైసీపీ కార్యకర్తగానే కొనసాగుతానని మేకతోటి చెప్పుకొచ్చారు. తనను సీఎం జగన్ తన కుటుంబంలోని వ్యక్తిగా పరిగణిస్తారని ఆమె చెప్పారు. జగన్ నిర్ణయానికి తాను కట్టుబడి ఉన్నానని కూడా సుచరిత చెప్పారు. కొంతకాలంగా అనారోగ్యం నేపథ్యంలో బయటకు రాలేకపోయానని కూడా ఆమె చెప్పారు.