Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఖమ్మం జిల్లా టీఆర్ యస్ లో ఏమి జరుగుతుంది…?

ఖమ్మం జిల్లా టీఆర్ యస్ లో ఏమి జరుగుతుంది…?
-హరీష్ రావు తుమ్మల వద్దకు …పొంగులేటి ఇంటికి కేటీఆర్
-బుజ్జగింపులా? వీడ్కోలు సమావేశాలా??
-అసమ్మతిని చల్లార్చనున్నారా ?
-ఖమ్మం జిల్లాపై కేసీఆర్ ద్రుష్టి పెట్టారా ?
-అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్ గా వ్యూహం రచిస్తున్నారా?

ఖమ్మం జిల్లా టీఆర్ యస్ ఏమి జరుగుతుంది…ఇది రాజకీయాలపట్ల ఆశక్తి ఉన్నవారినే కాకా టీఆర్ యస్ హార్డ్ కోర్ కార్యకర్తలను సైతం వేధిస్తున్న ప్రశ్న ? హరీష్ రావు తుమ్మల వద్దకు వెళ్లడం …పొంగులేటి ఇంటికి కేటీఆర్ వెళ్లుతుండటంలో ఉన్న ఉద్దేశం ఏమిటి దేనికి సంకేతం … వారిని బుజ్జగించటానికా ? లేదా తాము వారిని అకామిడేట్ చేయలేమని చెప్పటం ద్వారా వారికీ వీడ్కోలు చెప్పటమా? వారిలో ఉన్న అసమ్మతిని చల్లార్చేందుకా? అనేది ఆశక్తికరంగా మారింది. 2023 జరిగే ఎన్నికల్లో ఖమ్మం జిల్లా పై కేసీఆర్ ప్రత్యేక ద్రుష్టి పెట్టారు . మెజార్టీ సీట్లు గెలవాలనే పట్టుదలతో ఉన్నారు . అందుకు జిల్లాలో తీసుకోవాల్సిన చర్యలపై వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు . అందులో భాగంగానే యువనేతలు అడుగులు వేస్తున్నారని అభిప్రాయాలు ఉన్నాయి.

అసలే సీఎం కేసీఆర్ కు ఖమ్మం జిల్లా అంటే చిర్రెత్తుకు వస్తుందనేది విశ్వసనీయ సమాచారం . అందుకు కారణం లేకపోలేదు …. 2014 ,2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 అసెంబ్లీ సీట్లు ఉండగా రెండు టర్మ్ లలోను కేవలం ఒక్కొక్కటి మాత్రమే టీఆర్ యస్ గెలిచింది. 2014 లో మొదటిసారిగా ఖమ్మం జిల్లాలో నాయకత్వం లేదని అనుకున్నప్పటికీ 2018 లో ఎందుకు ఇలా జరిగిందనేది కేసీఆర్ మదిలో మెదులుతున్న ప్రశ్న ? 2018 ఎన్నికల్లో హేమ హేమీలంతా టీఆర్ యస్ లోనే ఉన్నారు . కాంగ్రెస్, వైసీపీ నుంచి గెలిచిన వాళ్ళుకూడా టీఆర్ యస్ లో చేరారు . మాజీ మంత్రి తుమ్మల లాంటి సీనియర్ రాజకీయ వేత్త , రాజకీయ దురంధరుడు టీఆర్ యస్ లో చేరి మంత్రి అయ్యారు . మొదట ఎమ్మెల్సీగా తరవాత పాలేరు ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యే గా ఎన్నికై కేసీఆర్ ప్రభుత్వం లో కీలకంగా వ్యవహరించారు. భక్త రామదాస్ ప్రాజక్టు పూర్తీ చేయడంతో పాటు.సీతారామ ప్రాజెక్టు పనులు ప్రారంభించారు. జిల్లాలో అనేక అభివృద్ధి పనులు చేపట్టడమే కాకుండా జిల్లాకు తుమ్మల ఏది అడిగితె అది సీఎం కేసీఆర్ ఇచ్చారు . అయినప్పటికీ జిల్లాలో అసెంబ్లీ సీట్లు గెలవలేదు సరికదా ! మంత్రిగా ఉన్న తుమ్మల కూడా ఓడిపోయారు . దీనిపై కేసీఆర్ ఆగ్రహంగా ఉన్నారు . ఖమ్మం జిల్లాలో తమకత్తులు తమనే పొడిచాయని మీడియా సమావేశంలోనే కేసీఆర్ వ్యాఖ్యానించారు .

నాటి నుంచి సీనియర్ నేత తనకు అత్యంత దగ్గర మిత్రుడిగా ఉన్న తుమ్మలకు అక్కడో ఇక్కడో కలవడం తప్ప కనీసం అపాయింట్మెంట్ ఇవ్వలేదు . ఇక వైసీపీ నుంచి ఖమ్మం ఎంపీ గా గెలిచిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి నష్టం చేశాడని సామాజిక సమీకరణాల పేరుతొ తిరిగి ఇస్తానన్న ఖమ్మం లోకసభ టికెట్ ఇవ్వలేదు . దానికి బదులు ఆఫర్ చేశారని చెబుతున్న రాజ్యసభ సీటు పరిశీలన కూడా చేయలేదు . మధిరలో టీఆర్ యస్ అభ్యర్థిగా పోటీచేసిన లింగాల కమల్ రాజ్ గెలుపు కోసం తన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకున్న పొంగులేటి … వైరాలో సీఎం కేసీఆర్ టికెట్ ఇచ్చిన మదన్ లాల్ ఓటమికి అంతే పనిచేశారని ఆరోపణలు ఎదుర్కొన్నారు. పైగా జిల్లా చరిత్రలో ఇండిపెండెంట్ గా పోటీచేసి గెలిచిన రాములు నాయక్ ను సీఎం కేసీఆర్ దగ్గరకు తీసుకోని వెళ్లి పరిచయం చేయటం బెడిసి కొట్టింది. పార్టీ అభ్యర్థిని ఓడించి ద్రోహం చేశాడని పొంగులేటి మీద కేసీఆర్ నాటి నుంచి గుర్రుగా ఉన్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సైతం పొంగులేటి అనుయాయిలు పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన తాతా మధు కు ఓట్లు వేయలేదని ఆరోపణలు ఉన్నాయి.

ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లాకు చెందిన ఇద్దరు కీలక నేతలకు ప్రగతి భవన్ లోని సీఎం ఛాంబర్ గేట్లు ముసుకపోయాయనే టాక్ ఉంది. అయితే జిల్లాలో వారు ఇప్పటికీ టీఆర్ యస్ లో బలమైన నేతలుగానే గుర్తింపు పొందారు. అందువల్ల వారి సేవలు పార్టీకి ఉపయోగించుకోవాలని కేటీఆర్ , హరీష్ రావు లు భావిస్తున్నారు . అందులో భాగంగానే తుమ్మల దగ్గరకు హరీష్ రావు , పొంగులేటి దగ్గరకు కేటీఆర్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఈ నెల 18 న కేటీఆర్ ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ నూతనంగా నిర్మించిన భవనాన్ని,లాకారంలో నిర్మించిన తీగల బ్రిడ్జి ని ,రఘునాథపాలెం మండలంలో ప్రకృతివనాన్ని ప్రారంభించేందుకు వస్త్తున్నారు. ఈ సందర్భంగా పొంగులేటి నివాసంలో లంచ్ ఏర్పాటు చేసినట్లు శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. నెల రోజుల క్రితం మంత్రి హరీష్ రావు ఖమ్మం వచ్చినప్పుడు బేతుపల్లి గంగారాం వద్ద గల తుమ్మల ఫామ్ హౌస్ లో ఒకరాత్రి ఉన్నారు . ఇప్పుడు కేటీఆర్ పొంగులేటి ఇంటికి వస్తున్నారు . అసమ్మతినేతలుగా ముద్రపడిన వారి ఇళ్లకు కేటీఆర్ ,హరీష్ రావు లాంటి నేతలు వెళ్లడం, మిగతావారిని వారి కార్యక్రమాలకు వెళ్లకుండా అడ్డుకోవడంపై కార్యకర్తల్లోనే అయోమయం నెలకొన్నది …అసలు ఖమ్మం జిల్లా టీఆర్ యస్ లో ఏమి జరుగుతుంది అనేది చర్చనీయాంశంగా మారింది…..

Related posts

మోదీ ప్రధాని కాదు… ఒక రాజు లాంటి వాడు: రాహుల్ గాంధీ

Drukpadam

మోడీతో భేటీకి కేసీఆర్ ఆశక్తి ..నేడు ఎర్రవల్లి లో మంత్రులు అధికారులతో తర్జన భర్జన …

Drukpadam

ప్రశాంత్ కిశోర్ ఎత్తుగడలు తెలంగాణలో పనిచేయవు: ఈటల

Drukpadam

Leave a Comment