Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

చైనా దాడి చేసిందంటూ తైవాన్ ప్రభుత్వ చానల్లో వార్తలు… హడలిపోయిన ప్రజలు!

చైనా దాడి చేసిందంటూ తైవాన్ ప్రభుత్వ చానల్లో వార్తలు… హడలిపోయిన ప్రజలు!

  • తైవాన్, చైనా మధ్య నివురుగప్పిన నిప్పులా పరిస్థితి
  • ఉక్రెయిన్ పై రష్యా దాడి నేపథ్యంలో చైనాపై మరింత అనుమానం
  • అప్రమత్తంగా ఉంటున్న తైవాన్
  • మాక్ డ్రిల్ చేపట్టిన తైవాన్ ప్రభుత్వ మీడియా
  • పొరబాటున వార్తలు ప్రసారం

ఇటీవలి పరిణామాల నేపథ్యంలో తైవాన్, చైనా మధ్య తీవ్రస్థాయిలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. తరచుగా చైనా కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో తైవాన్ సదా అప్రతమత్తంగా ఉంటోంది. ఉక్రెయిన్ పై రష్యా దాడులు జరుపుతున్న క్రమంలో, చైనా కూడా ఇదే తరహా దూకుడు ప్రదర్శిస్తుందేమోనని తైవాన్ ప్రజల్లో సందేహాలు ఉన్నాయి.

కాగా, తైవాన్ ప్రభుత్వ టీవీ చానల్ అప్రమత్తత విషయంలో కాస్త మోతాదు మించి వ్యవహరించింది. ఒకవేళ చైనాతో యుద్ధమే సంభవిస్తే అత్యవసర పరిస్థితుల్లో ఏంచేయాలో అగ్నిమాపక శాఖతో కలిసి సదరు టీవీ చానల్ మాక్ డ్రిల్ చేపట్టింది.

అయితే, మాక్ డ్రిల్ సందర్భంగా రూపొందించిన ఉత్తుత్తి యుద్ధం వార్తలు టీవీ చానల్లో నిజంగానే ప్రసారం అయ్యాయి. ఉదయాన్నే నిద్రలేచి టీవీ చూసిన తైవాన్ ప్రజలు ఆ వార్తలు చూసి తీవ్ర ఆందోళనకు గురయ్యారు. తైవాన్ పై చైనా దాడి చేసిందని, రాజధాని నగరం తైపీకి సమీపంలో కొన్ని యుద్ధ నౌకలు, ఇతర వ్యవస్థలపై చైనా మిస్సైల్ దాడులు చేసిందని తైవాన్ ప్రభుత్వ టీవీ చానల్ పేర్కొంది.

అంతేకాదు, తైపీకి సమీపంలోని ప్రధాన రైల్వే స్టేషన్ ను చైనా ఏజెంట్లు అగ్నికి ఆహుతి చేశారని వెల్లడించింది. యుద్ధం వచ్చే పరిస్థితులు ఉండడంతో తైవాన్ అధ్యక్షురాలు దేశంలో ఎమర్జెన్సీ విధించారని ప్రభుత్వ చానల్ వివరించింది.

అసలే చైనా వైఖరి పట్ల ఎన్నో అనుమానాలున్న తైవాన్ ప్రజలు… తాజా ప్రకటనలో వణికిపోయారు. చైనా నిజంగానే యుద్ధానికి దిగిందేమోనని హడలిపోయారు. అయితే, ప్రభుత్వ టీవీ చానల్ కాసేపటికే తన తప్పిదాన్ని గుర్తించింది. వెంటనే సవరణ ప్రకటన చేసింది.

ప్రజలెవరూ భయపడాల్సిన పనిలేదని, అగ్నిమాపకశాఖతో మాక్ డ్రిల్ సందర్భంగా రూపొందించిన వార్తలు పొరబాటున లైవ్ లో ప్రసారం అయ్యాయని వివరణ ఇచ్చింది. సాంకేతిక లోపం కారణంగా ఇలా జరిగిందని, దేశ ప్రజలు క్షమించాలని కోరింది. కాగా, తమ వివరణ పట్ల తైవాన్ ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారని కూడా ఆ చానల్ వెల్లడించింది.

Related posts

మీరు మనసులో అనుకుంటే చాలు.. కంప్యూటర్ చేసేస్తుంది.. మస్క్ కొత్త ప్రాజెక్ట్!

Drukpadam

అందుకే సీబీఐకి నిజం చెప్పేశా, ఇప్పటికీ నాకు వాళ్ల నుంచి ప్రమాదం ఉంది: దస్తగిరి…!

Drukpadam

మాది చేతల ప్రభుత్వం… పొగులేటి

Ram Narayana

Leave a Comment