హెచ్1బీ వీసాదారులు, వారి జీవిత భాగస్వాములకు అమెరికా శుభవార్త!
- వర్క్ పర్మిట్ కాల పరిమితి పొడిగింపు గడువు పెంపు
- ఈఏడీపై ఇప్పటిదాకా 180 రోజుల పొడిగింపు
- దానిని 540 రోజులకు పెంచిన ఇమిగ్రేషన్ డిపార్ట్ మెంట్
- వేలాది మంది భారతీయులకు లబ్ధి
హెచ్1బీ వీసాదారులు, వారి భార్య/భర్తకు అమెరికా తీపి కబురు చెప్పింది. ఉద్యోగ అనుమతులను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. గ్రీన్ కార్డుల కోసం వేచి చూస్తున్న హెచ్1బీ వీసాదారులు, వారి జీవితభాగస్వాములకు మరో ఏడాదిన్నర పాటు వర్క్ పర్మిట్ ను పెంచుతూ అమెరికా డిపార్ట్ మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ ఇవాళ ప్రకటన జారీ చేసింది.
ఈ నిర్ణయంతో వేలాది మంది భారతీయులు లాభపడనున్నారు. నిన్నటి (మే 4వ తేదీ) నుంచే విదేశీ ఉద్యోగులకు ఈ పొడిగింపు వర్తించనుంది. ఇప్పటిదాకా ఎంప్లాయ్ మెంట్ ఆథరైజేషన్ కార్డ్ (ఈఏడీ)పై ఉన్న 180 రోజుల అదనపు గడువు.. ఆటోమేటిక్ గా 540 రోజులకు పెరుగుతుందని పేర్కొంది.
‘‘అమెరికా పౌరసత్వం, వలస సేవల విభాగం (యూఎస్సీఐఎస్) ప్రస్తుతం పెండింగ్ లో ఉన్న ఈఏడీ అభ్యర్థనల పరిష్కారం కోసం పనిచేస్తోంది. అయితే, ఉద్యోగ అనుమతి గడువుపై ఇప్పుడున్న 180 రోజుల పొడిగింపు గడువు సరిపోదని భావించింది. ఈ నేపథ్యంలోనే అమెరికాలో పనిచేస్తున్న విదేశీయుల వర్క్ పర్మిట్ కు సంబంధించి పొడిగింపు గడువును పెంచాలని నిర్ణయించింది. దాని వల్ల ఉద్యోగుల కుటుంబాలు, సంస్థలకు మేలు కలగనుంది’’ అని యూఎస్సీఐఎస్ డైరెక్టర్ ఎం. జడ్డౌ తెలిపారు.
వాస్తవానికి ఇప్పటికే చాలా మంది వర్క్ పర్మిట్ అదనపు కాలపరిమితితో సహా గడువు తీరిపోయింది. ఈ నేపథ్యంలోనే మే 4 నుంచి గడువు పొడిగింపు వర్తించేలా ఆదేశాలు జారీ చేసింది. ఉద్యోగులు 540 రోజుల గడువు పరిధిలో ఉండి ఉంటే ఎలాంటి అభ్యంతరం లేకుండా జాబ్ చేసుకునే వీలుంటుంది.
కాగా, వచ్చే నెల రోజుల్లో మరో 87 వేల మంది వలసదారుల పనికాలపరిమితి తీరిపోనుందని, ఇమిగ్రేషన్ డిపార్ట్ మెంట్ తీసుకున్న నిర్ణయంతో వారికి మేలు జరగనుందని ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ లీడర్ అజయ్ జైన్ భుటోరియా చెప్పారు. అమెరికా ప్రభుత్వ నిర్ణయం వల్ల 4.2 లక్షల మంది వలసదారులకు మేలు కలుగుతుందన్నారు.
కాగా, పని కాలపరిమితికి సంబంధించి అమెరికా ఇమిగ్రేషన్ డిపార్ట్ మెంట్ వద్ద 15 లక్షలకు పైగా దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, ఇప్పటికే కరోనాతో కుదేలైన కుటుంబాలు, సంస్థలకు ఇది శరాఘాతంగా పరిణమించింది. చాలా కంపెనీలనూ ఇప్పుడు ఉద్యోగుల కొరత వేధిస్తోంది. ఇటు ఉద్యోగాలు లేక ప్రజలూ ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటు ఇమిగ్రెంట్స్, సంస్థలకు అమెరికా తీసుకున్న నిర్ణయం మేలు చేస్తుందని చెబుతున్నారు.