ఏపీ కోటాలో రాజ్యసభకు వెళ్లనున్న నలుగురు ప్రముఖుల బయోడేటాలు ఇవే
- నెల్లూరు జిల్లాకు చెందిన సాయిరెడ్డి, బీద మస్తాన్ రావులు
- తెలంగాణకు చెందిన ఆర్.కృష్ణయ్య, నిరంజన్ రెడ్డిలు
- నలుగురికి వైసీపీ రాజ్యసభ సభ్యత్వాలు
ఏపీ కోటాలో రాజ్యసభకు వెళ్లనున్న నలుగురు ప్రముఖులను అధికార వైసీపీ ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఈ జాబితాలో వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత వేణుంబాక విజయసాయిరెడ్డి, బీద మస్తాన్ రావు, ఆర్.కృష్ణయ్య, నిరంజన్ రెడ్డిలు ఉన్న సంగతి తెలిసిందే. జూన్ 21న ఏపీ కోటాలోని 4 సీట్లు ఖాళీ కానుండగా..వాటిలో వీరు చేరిపోతారు. వైసీపీ ఎంపిక చేసిన వీరి పూర్తి వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి.
1. వేణుంబాక విజయసాయిరెడ్డి- వైసీపీ ప్రధాన కార్యదర్శిగానే కాకుండా పార్లమెంటులో ఆ పార్టీ నేతగా వ్యవహరిస్తున్న సాయిరెడ్డి…నెల్లూరు జిల్లాలోని తాళ్లరేవులో 1957 జూలై 1న జన్మించారు. రాజకీయాల్లోకి రాకముందు చార్టెర్ట్ అకౌంటెంట్‌గా చెన్నైకేంద్రంగా పనిచేసిన సాయిరెడ్డి.. సీఎం వైఎస్ జగన్ కంపెనీలకు ఆర్థిక సేవలందించేవారు. ఈ క్రమంలోనే జగన్ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడిగా మారిన ఈయన.. జగన్‌పై నమోదైన అక్రమాస్తుల కేసుల్లో రెండో ముద్దాయిగా ఉన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన జగన్ వైసీపీ పేరిట కొత్త పార్టీ పెట్టిన నాటి నుంచి సాయిరెడ్డి కూడా జగన్ వెంటే నడిచారు. అంతేకాకుండా వైసీపీ తరఫున తొలి రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా సాయిరెడ్డే దక్కించుకున్నారు. తాజాగా మరోమారు ఆయనను రాజ్యసభలో కొనసాగించేలా వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంది.
2. బీద మస్తాన్ రావు- 1958 జూలై 2న నెల్లూరు జిల్లా కావలిలో జన్మించిన బీద మస్తాన్ రావు.. ఆక్వా రంగంలో ప్రముఖ పారిశ్రామికవేత్తగా ఎదిగారు. బీఎంఆర్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అధినేతగా ఆయన చిరపరచితులు. 2001లో టీడీపీ తరఫున జడ్పీటీసీగా ఎన్నికైన ఆయన 2009లో ఆ పార్టీ తరఫున ఎమ్మెల్యేగానూ విజయం సాధించారు. ఓ వైపు రాజకీయాల్లో చురుగ్గా ఉంటూనే మరోవైపు తన వ్యాపార సామ్రాజ్యాన్ని ఆయన విదేశాలకు కూడా విస్తరించారు. 1991లో సముద్ర ఆహార పరిశ్రమను నెలకొల్పిన ఆయన ఆక్వా రంగంలో దేశ విదేశాల్లో కంపెనీలను స్థాపించారు. అంతకుముందు సవేరా హోటల్స్‌కు ఫైనాన్షియల్ మేనేజర్‌గానూ ఆయన వ్యవహరించారు.
3. ఆర్.కృష్ణయ్య- తెలంగాణలోని వికారాబాద్ జిల్లా రాళ్లగుడిపల్లిలో 1954 సెప్టెంబర్ 13న జన్మించిన ఆర్.కృష్ణయ్య… విద్యార్థి దశ నుంచే బీసీ ఉద్యమాల్లో చురుగ్గా పాలుపంచుకున్నారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడిగా ఆయన కొనసాగుతున్నారు. ఎంఏ, ఎల్ఎల్ఎం, ఎంఫీల్ చదివిన కృష్ణయ్య.. బీసీ ఉద్యమ నేతగా తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక గుర్తింపు పొందారు. టీడీపీతో రాజకీయ జీవితం ప్రారంభించిన ఆయన 2014లో ఎల్బీ నగర్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత టీడీపీ నుంచి బయటకు వచ్చిన ఆయన 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై మిర్యాలగూడ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత రాజకీయాలకు దూరం జరిగిన ఆయన బీసీ ఉద్యమ నేతగానే కొనసాగుతున్నారు. తాజాగా రాజ్యసభ సీటుతో ఆయన వైసీపీలో కొనసాగనున్నారు.
4. నిరంజన్ రెడ్డి- 1970 జూలై 22న తెలంగాణలోని నిర్మల్‌లో జన్మించిన నిరంజన్ రెడ్డి… పుణేలోని ప్రముఖ లా కాలేజీ సింబయాసిస్‌లో న్యాయ శాస్త్రాన్ని అభ్యసించారు. జగన్‌కు ఆయన చాలా కాలం నుంచి వ్యక్తిగత న్యాయవాదిగా వ్యవహరిస్తున్నారు. న్యాయవాద వృత్తితో భాగంగా ఆయన సుప్రీంకోర్టులో న్యాయవాదిగా వ్యవహరిస్తూనే సినిమా నిర్మాతగా కూడా పలు సినిమాలు నిర్మించారు.