ప్రభుత్వాలను మార్చే శక్తి రైతులకు ఉంది…చండీఘర్ లో సీఎం కేసీఆర్!
-రైతులు తలచుకుంటే ఏమైనా చేయగలరు, ప్రభుత్వం మార్చగలరు
-600 కుటుంబాలకు 3 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించిన కేసీఆర్
-రైతులు ఆందోళన చేస్తే ఖలిస్థానీ ఉగ్రవాదులతో పోల్చుతారా? కేసీఆర్ మండిపాటు
దేశానికి అన్నం పెట్టేది రైతు.. అన్నదాత తలచుకుంటే ప్రభుత్వాలే తారుమారు అవుతాయని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు . పంజాబ్ పర్యటనలో రైతులకు సహాయం చేసే కార్యక్రమంలో పాల్గొన్న కేసీఆర్ పై మాటలు అన్నారు. రైతులు తలచుకుంటే ప్రభుత్వాలే మారతాయని ప్రభుత్వాలు కూలిపోవడం ఖాయమని అన్నారు . చండీగఢ్‌లోని ఠాగూర్ ఆడిటోరియంలో రైతు ఉద్యమంలో మరణించిన రైతు కుటుంబాలను, గాల్వాన్ సరిహద్దు ఘర్షణల్లో అమరులైన సైనిక కుటుంబాలను సీఎం కేసీఆర్ పరామర్శించారు. ఈ సందర్భంగా 600 కుటుంబాలకు 3 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించారు.
రైతులు ఆందోళన చేస్తే ఖలిస్థానీ, ఉగ్రవాదులతో పోల్చడం సరికాదన్నారు. రైతు నేతలు తలచుకుంటే ఏమైనా చేయగరలని చెప్పారు. పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్.. దేశవ్యాప్తంగా ఉద్యమిస్తే ప్రభుత్వం తప్పకుండా మారుతుందని చెప్పారు. ఢిల్లీ సరిహద్దుల్లో ఉంటూ రైతులకు సేవ చేసే భాగ్యం కేజ్రీవాల్‌కు దక్కిందని చెప్పారు. రైతులు, రైతు సోదరులు, సోదరిమణులకు ఎప్పుడూ మద్దుతు నిలుస్తామని చెప్పారు.
తెలంగాణ రాష్ట్రంలో కూడా రైతులు అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారని చెప్పారు. వారి కష్టాలు చూసి.. ఉచిత విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. కానీ కేంద్రం మాత్రం విద్యుత్ మోటార్లు బిగించాలని చూస్తోందని తెలిపారు. ఇదే అంశంపై పోరాడుతామని చెప్పారు. చావడానికి అయినా సిద్దం అని.. మోటార్లు మాత్రం పెట్టబోమని మరోసారి తేల్చి చెప్పారు.
రైతులకు ఫ్రెండ్లీగా ఉన్న ప్రభుత్వాలంటే మోడీ ప్రభుత్వానికి అస్సలు గిట్టదని కేసీఆర్ మండిపడ్డారు. కేంద్రం అనుసరిస్తున్న రైతు విధానాలకు వ్యతిరేకంగా దేశంలోని రైతులందరూ ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వాలను మార్చే శక్తి రైతులకు ఉందని వారికి ధైర్యం ఇచ్చారు. తాము ఒంటరయ్యామని రైతు కుటుంబాలు ఆందోళన చెందవద్దని, తామంతా అండగా ఉన్నామని కేసీఆర్ పూర్తి భరోసానిచ్చారు.దేశ వ్యాప్తంగా రైతులు చేసే ఉద్యమానికి తమ ప్రభుత్వం పూర్తి అండగా వుంటుందని, వాటికి మద్దతిస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు.