రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి వైసీపీ మద్దతు ….?
-మోదీతో ముగిసిన జగన్ భేటీ… 45 నిమిషాల పాటు సాగిన సమావేశం
-రాష్ట్రపతి ఎన్నికలపై చర్చ
-పెండింగ్ అంశాలను ప్రస్తావించిన జగన్
-మోదీతో భేటీ అనంతరం నిర్మలతో భేటీకి వెళ్లిన జగన్
-షాకవత్ ను కలిసిన జగన్ …రేపు ఉదయం అమిత్ షాతో భేటీ
జులైలో జరగనున్న భారత రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి వైసీపీ మద్దతు ఇస్తుందని సమాచారం . ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇ నేడు ఢిల్లీలో ప్రధాని మోడీతో 45 నిముషాలు పలు అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తుంది . ఈ సందర్భంగా వారిరువురి మధ్య రాష్ట్రపతి ఎన్నికలపై చర్చ జరిగినట్లు సమాచారం. త్వరలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లో బిజెపికి ఓట్ల సంఖ్య కొంత తక్కువగా ఉంది. దీంతో ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిల సహకారం అవసరమైంది. దాంతో వారిరువురితో సంప్రదింపుల చేసుకోవడం ద్వారా తమ అభ్యర్థిని రాష్ట్రపతిగా చేయవచ్చునని బిజెపి భావిస్తోంది. అందులో భాగంగానే జగన్ మోహన్ రెడ్డిని ఢిల్లీకి పిలిపించిన ప్రధాని మోడీ ఆయనతో తన మనసులో మాటను చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. దీనికి జగన్ సానుకూలంగా స్పందించారని తెలుస్తోంది.
ప్రతిపక్షాలు ఉమ్మడి అభ్యర్థిగా ఒకరిని పెట్టి గట్టి పోటీ ఇవ్వాలని ప్రయత్నిస్తున్నాయి. 2024 లో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపికి వ్యతిరేకంగా కూటమి ఏర్పాటు చేయాలని ఆలోచనలు చేస్తున్నాయి . ఈ సందర్భంగా ప్రధానితో సీఎం జగన్ రాష్ట్రానికి సంబంధించిన సమస్యలను కూడా ప్రధాని ప్రస్తావించినట్లు సమాచారం.
దేశంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో రాష్ట్రపతి ఎన్నిక కీలకంగా మారింది రాష్ట్రపతి అభ్యర్థిగా ఎవరు అనేది ప్రధాని జగన్ కు చెప్పారో లేదో తెలియదు గాని వచ్చే నెల లో రాష్ట్రపతి ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ఈభేటీకీ ప్రాధాన్యత ఏర్పడింది. అయితే ప్రస్తుతం రాష్ట్రపతిగా ఉన్న రామ్నాథ్ కోవింద్ మరోసారి అవకాశం ఇస్తారా లేక మరో అభ్యర్థిని రంగంలోకి దించుతారా ? అని చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన కు ప్రాధాన్యత ఏర్పడింది. ప్రధాని మోడీ తో పాటు సీఎం జగన్ మోహన్ రెడ్డి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ తోభేటీ అయినట్లు సమాచారం.కేంద్ర జలవనరుల శాఖామంత్రి షాకవత్ ను కలిసిన సీఎం జగన్ రేపు ఉదయం అమిత్ షా తో భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రానికి రావాల్సిన నిధులు గురించి వారి వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా విభజన చట్టంలో ఉన్నవివిధ అంశాలను ప్రస్తావించినట్లు తెలుస్తుంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో జగన్మోహన్ రెడ్డి ఈ సందర్భంగా ప్రధాని మోడీ వద్ద , ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఏదేమైనా రాష్ట్రపతి ఎన్నికల్లో ఆంధ్ర ప్రదేశ్ ఓట్లు కీలకంగా మారడంతో జగన్ ఢిల్లీ పర్యటన ఫోకస్ గా మారింది. దీంతో రాష్ట్రపతి ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి గెలుపు ఖాయం గా కనిపిస్తుంది.