Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కోనసీమ అల్లర్లు వైసీపీ పనే… పక్కా ప్లాన్ తో చేశారు: పవన్ కల్యాణ్

కోనసీమ అల్లర్లు వైసీపీ పనే… పక్కా ప్లాన్ తో చేశారు: పవన్ కల్యాణ్

  • మంగళగిరిలో పవన్ కల్యాణ్ స్పీచ్
  • కోనసీమ అల్లర్లపై స్పందన
  • జనసేన పార్టీకి ఈ గొడవల్లో ప్రమేయం లేదని స్పష్టీకరణ
  • వైసీపీ ఓ రౌడీ మూక, గూండాల గుంపు అని వ్యాఖ్యలు

మంగళగిరిలో జనసేన పార్టీ విస్తృతస్థాయి సమావేశం అనంతరం పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రసంగించారు. కోనసీమ అల్లర్లను కులఘర్షణలుగా వైసీపీ ప్రభుత్వం చిత్రీకరిస్తుండడాన్ని తాము సునిశితంగా గమనిస్తున్నామని తెలిపారు. దీన్ని ఎలా ఎదుర్కోవాలో పరిశీలిస్తున్నామని వివరించారు. జనసేన సైద్ధాంతిక బలం ఉన్న పార్టీ అని స్పష్టం చేశారు. భారతదేశ రాజకీయాలు కులాలతో ముడిపడి ఉన్న విషయం అందరూ అంగీకరించాల్సిందేనని, ఎన్నికల్లో కుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

కులాలపై ఆధారపడే పార్టీల్లో వైసీపీ కూడా ఒకటని, కులాలను విభజించి పాలించాలని వాళ్లు ప్రయత్నిస్తుంటారని ఆరోపించారు. తాము కులాలను కలపాలని ప్రయత్నిస్తుంటామని ఉద్ఘాటించారు. అన్ని కులాలు శ్రమిస్తేనే ఈ సమాజంలో పనులు జరుగుతాయని, నోటికి ముద్ద చేరాలన్నా దానివెనుక ఎన్నో కులాల కష్టం ఉంటుందని వివరించారు.

కోనసీమ అల్లర్లపై స్పందిస్తూ, ఈ ఘర్షణలను తాము బహుజన సిద్ధాంతాలపైనా, బహుజన ఐక్యతపైనా జరిగిన దాడులుగా భావిస్తున్నామని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. కులాల నేపథ్యంలో నడుస్తున్న సమాజంలో గొడవలు జరుగుతుంటాయని అన్నారు. నాడు వంగవీటి రంగా వ్యవహారంలో విజయవాడలో రెండు కులాలు విడిపోయిన పరిస్థితి ఏర్పడిందని, విజయవాడ నెలరోజుల పాటు తగలబడిపోయిందని వివరించారు.

తెలంగాణలో కులాలను మించి ‘తెలంగాణ’ అనే భావన ఉంటుందని, కానీ మనకి ‘ఆంధ్రా’ అనే భావనలేదని పవన్ కల్యాణ్ విచారం వ్యక్తం చేశారు. దీనికి ముఖ్యకారణం ప్రజలు కాదని, నాయకులేనని ఆరోపించారు.

“వైసీపీ నాయకుడు… పెద్ద వయసున్న వ్యక్తీ కాదు… ఓ 40 ఏళ్ల వయసున్న నాయకుడు అతను… మరో పాతికేళ్లు బంగారు భవిష్యత్తును నిర్మించాల్సిన వ్యక్తి కూడా ఇలాంటివాడే. కానీ, అవినీతి, లక్ష కోట్లు గురించి మనం మాట్లాడలేం. అందరం అర్థం చేసుకున్నాం. ఇవాళ జీవితంలో అవినీతి కూడా ఓ భాగమైపోయిందని అర్థం చేసుకున్నాం. మనదేశంలో అవినీతి అనేది తప్పు కాదన్నట్టుగా తయారైంది… ఇప్పుడుకాక ఇంకెప్పుడు సంపాదించుకుంటారండీ (వ్యంగ్యంగా).

అవినీతితో వచ్చిన వ్యక్తులు ఇవాళ ఏసీబీని కంట్రోల్ చేస్తున్నారు. అరవింద్ కేజ్రీవాల్ గానీ, లోక్ సత్తా జయప్రకాశ్ నారాయణ వంటి నిజాయతీపరులైన అధికారులు ఇలాంటివి చేస్తామని చెబితే అర్థంచేసుకుంటాం. కానీ, అవినీతిలో కూరుకుపోయిన వ్యక్తులే అవినీతిని నిర్మూలిస్తామని చెబుతుండడం హాస్యాస్పదం. ఎక్కడ అవినీతి జరిగినా ఫిర్యాదు చేయండని ముఖ్యమంత్రి అంటుంటే… మీరే అవినీతిపరుడు అని చెప్పాలని నాకు అనిపించింది. మీరు చేసే ఇసుక అక్రమాలకు మేం ఏ యాప్ కు ఫిర్యాదు చేయాలో చెప్పండి. ఇలాంటివి భరించలేని వ్యక్తిని నేను. జనసేన ఆవిర్భావానికి ఇది కూడా ఒక మూలకారణం.

ఎంతో ప్రశాంతమైన కోనసీమ ఇవాళ భగ్గున రగిలిపోయింది. దీనికంతటికీ కారణం వైసీపీనే. ఎంతో పక్కాగా ప్రణాళిక వేసి గొడవలు రేకెత్తించారు. కేవలం ఒక కులాన్ని లక్ష్యంగా చేసుకుని రాజకీయాలు చేయడం సరికాదు. అన్ని కులాలు ఓట్లు వేస్తేనే వైసీపీ గెలిచింది. కోనసీమ అల్లర్ల గురించి రాష్ట్ర నిఘా వర్గాలకు ముందే తెలుసు. కేంద్రం నిఘా వర్గాలు దీనిపై ముందే హెచ్చరించాయి. ఇన్ని తెలిసి కూడా గొడవలు జరుగుతూ ఉంటే ప్రణాళికతో వ్యవహరించి కోనసీమలో చిచ్చుకు కారణమయ్యారు. వైసీపీది ఓ రౌడీ మూక, గూండాల గుంపు. పద్ధతిగా మాట్లాడడం వాళ్లకు తెలియదు.

మా సహనాన్ని పరీక్షించే ప్రయత్నం చేయొద్దు. కోనసీమ అల్లర్లకు ఏమాత్రం సంబంధంలేని మా జనసేన వాళ్లను అరెస్ట్ చేస్తున్నారు. ఏదైనా ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలని చెప్పే మేం అల్లర్లను ఎలా ప్రోత్సహిస్తామని అనుకున్నారు? నేను మాట్లాడినప్పుడో, మా నేతలు మాట్లాడినప్పుడో మీరు మమ్మల్ని బాధ్యుల్ని చేయాలి… ఈ గొడవకు మీరే బాధ్యులు. జిల్లా పేరుమార్పుకు నెల సమయం ఇచ్చింది మీరే.

మీ వైసీపీ ఎమ్మెల్యే బూతులు తిడితే, మేం వస్తున్నామని 144 సెక్షన్ పెడతారే… మరి అంబేద్కర్ పేరు పెడుతున్నప్పుడు గొడవలు జరుగుతుంటే పోలీసులను మోహరించరా? పారామిలిటరీ బలగాలను దించరా? ఇంత అసమర్థంగా పరిపాలిస్తున్నారు మీరు… కోనసీమలో గొడవలు జరగాలనే మీరు కోరుకున్నారు. కోనసీమ చక్కని వాతావరణాన్ని కలుషితం చేయాలని కంకణం కట్టుకున్నారు మీరు. దీనివల్ల జనసేనకు ఏదో జరిగిపోతుందని మీరు అనుకుంటే అది మీ భ్రమే. నేను కులాలను కలిపేవాడ్ని. మీ పార్టీ పేరు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ. కానీ యువజనుల మధ్య చిచ్చుపెడుతోంది మీరే” అంటూ పవన్ కల్యాణ్ విమర్శనాస్త్రాలు సంధించారు.

Related posts

పదికి పదీ గెలిపిస్తాం..సత్తుపల్లి కృతజ్ఞతా సభలో మంత్రి అజయ్

Drukpadam

ఏపీ బీజేపీకి కోర్ కమిటీని ప్రకటించిన అధిష్ఠానం…

Drukpadam

కమ్మకులం పైన సంచలన వ్యాఖ్యలు చేసిన కొడాలి నాని!

Drukpadam

Leave a Comment