కొత్త కార్మిక చట్టాలు వచ్చేస్తున్నాయి.. ప్రైవేటు ఉద్యోగుల ‘చేతికి వచ్చే వేతనం’లో తగ్గుదల!
జులై 1 నుంచి అమల్లోకి రానున్న నాలుగు కార్మిక చట్టాలు
కొత్త చట్టాల ద్వారా సంస్కరణలు వస్తాయంటున్న ప్రభుత్వం
భవిష్య నిధికి కార్మికుడు, యజమాని జమచేసే మొత్తంలోనూ పెరుగుదల
ఇకపై 180 రోజులు పనిచేస్తేనే ఎర్న్‌డ్ లీవ్స్
జులై 1 నుంచి కొత్త కార్మిక చట్టాలను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఇది అమలులోకి వస్తే, కార్యాలయ పని వేళలు, ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) వాటా, వేతనాలలో గణనీయమైన మార్పు వచ్చే అవకాశం ఉంది. అలాగే, ఆఫీసు వేళలు, పీఎఫ్ కంట్రిబ్యూషన్ పెరిగే అవకాశం ఉన్నప్పటికీ, చేతికి వచ్చే వేతనం తగ్గే అవకాశం ఉంది. మొత్తం నాలుగు కార్మిక చట్టాలను తీసుకొస్తున్నట్టు కేంద్రం ఇది వరకే ప్రకటించింది. ఇవి అమల్లోకి వస్తే దేశంలో పెట్టుబడులు పెరుగుతాయని, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ప్రభుత్వం భావిస్తోంది.
కొత్తగా అమల్లోకి వచ్చే లేబర్ కోడ్‌ల ద్వారా వేతనాలు, సామాజిక భద్రత, కార్మిక సంక్షేమం, ఆరోగ్యం, రక్షణ, పని పరిస్థితులు (మహిళలతో సహా) తదితర అంశాల్లో ఆశిస్తున్న సంస్కరణలు వస్తాయని అభిప్రాయపడింది.
కొత్త కార్మిక చట్టాలు అమల్లోకి వస్తే జరిగే మార్పులు ఇవే..
-
కొత్త కార్మిక చట్టాలు అమలైతే ఆఫీస్ పని వేళలను కంపెనీలు గణనీయంగా మార్చుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఉన్న 8-9 గంటల పనివేళలను 12 గంటలకు పెంచుకోవచ్చు. అయితే, అప్పుడు వారు తమ ఉద్యోగులకు మూడు వీక్లీ ఆఫ్‌లు ఇవ్వాల్సి ఉంటుంది. వారంలో మొత్తం పని గంటల్లో మాత్రం మార్పు ఉండకపోవచ్చు.
-
పరిశ్రమల్లో ఓవర్ టైం (ఓటీ) 50 గంటల నుంచి 125 గంటలకు పెరుగుతుంది.
-
ఉద్యోగి, యజమాని జమ చేసే భవిష్య నిధి మొత్తం పెరుగుతుంది. మొత్తం వేతనంలో 50 శాతం బేసిక్ శాలరీ ఉండాలి. దానివల్ల భవిష్య నిధికి కార్మికుడు జమచేసే మొత్తం పెరుగుతుంది. అంతే స్థాయిలో యజమాని కూడా జమ చేయాలి. ఈ నిబంధన వల్ల కొందరు ఉద్యోగులకు, మరీ ముఖ్యంగా ప్రైవేటు రంగంలోని ఉద్యోగుల టేక్ హోం శాలరీ (చేతికి వచ్చే వేతనం) గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.
-
పదవీ విరమణ తర్వాత వచ్చే మొత్తం, గ్రాట్యుటీ మొత్తం కూడా పెరుగుతుంది. దీనివల్ల ఉద్యోగులు పదవీ విరమణ తర్వాత మెరుగైన జీవితాన్ని గడిపే అవకాశం ఉంటుంది.
-
కార్మికుడు ఉద్యోగ సమయంలో పొందగలిగే సెలవులను హేతుబద్ధీకరించింది. సాధారణంగా ఏడాదికి 240 రోజులు పనిచేస్తే ఆర్జిత సెలవులు లభిస్తాయి. అయితే, ఇప్పుడు దీనిని 180 రోజులకు తగ్గించింది. అయితే, ప్రతి 20 రోజుల పనిదినాలకు కార్మికులు తీసుకునే ఒక రోజు సెలవు విషయంలో ఎలాంటి మార్పు లేదు.
-
కరోనా మహమ్మారి సమయంలో పలు కంపెనీలు ఉద్యోగులతో ఇంటి నుంచి పని చేయించాయి. ఇప్పుడీ ‘వర్క్ ఫ్రం హోం’కు ప్రభుత్వం చట్టబద్ధత కల్పించింది.