ముషారఫ్ ఆరోగ్యం ఆందోళనకరం …అండగా నిలిచిన పాక్ ఆర్మీ !
-విషమించిన ముషారఫ్ ఆరోగ్య పరిస్థితి.. పాకిస్థాన్ కు తరలించేందుకు ఏర్పాట్లు!
-యూఏఈలో చికిత్స పొందుతున్న ముషారఫ్
-ఆయన కోలుకోవడం అసాధ్యమన్న కుటుంబ సభ్యులు
-ముషారఫ్ కు అండగా పాక్ ఆర్మీ
పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ ఆరోగ్య పరిస్థితి విషమించింది. ఇంతకాలం ఆయన యూఏఈలో చికిత్స పొందారు. ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ఆయనను పాకిస్థాన్ ఆర్మీకి చెందిన ఎయిర్ అంబులెన్స్ లో స్వదేశానికి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ముషారఫ్ కోలుకోవడం దాదాపు అసాధ్యమని ఆయన కుటుంబ సభ్యులు చెపుతున్నారు. యూ ఏ ఈ లో ఉన్న ముషారఫ్ కు అక్కడే చికిత్స జరుగుతుంది. ఆయన్ను కాపాడేందుకు డాక్టర్లు అన్నిరకాల ప్రయత్నాలు చేశారు . అయినప్పటికీ ఆరోగ్యం విషమించింది. ఈ విషయాన్నీ స్వయంగా ఆయన కుటుంబసభ్యులు వెల్లడించారు .
మరోవైపు ముషారఫ్ కుటుంబం కోరుకుంటే… ఆయనను పాకిస్థాన్ కు తరలించేందుకు అన్ని విధాలా సహకరిస్తామని పాక్ సైన్యం చెప్పినట్టు అక్కడి మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇప్పటికే ముషారఫ్ కుటుంబ సభ్యులతో పాక్ ఆర్మీ మాట్లాడింది. ఆయనను పాకిస్థాన్ కు తీసుకొచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తామని తెలిపింది.
ముషారఫ్ పాకిస్థాన్ ఆర్మీ మాజీ చీఫ్ అనే విషయం తెలిసిందే. దీంతో, తమ మాజీ చీఫ్ కు అక్కడి ఆర్మీ అండగా నిలుస్తోంది. ఇప్పటికే ఒక ఎయిర్ అంబులెన్స్ ను సిద్ధంగా ఉంచిందని అక్కడి మీడియా వెల్లడించింది. ముషారఫ్ వయసు 78 సంవత్సరాలు. 1999 నుంచి 2008 వరకు ఆయన పాక్ ను పాలించారు.