గోడ దూకి బాసర ట్రిపుల్ ఐటీలో ప్రవేశించిన రేవంత్ రెడ్డి… అరెస్ట్ చేసిన పోలీసులు
- డిమాండ్ల సాధన కోసం విద్యార్థుల ధర్నాలు
- మద్దతు ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ
- విద్యార్థులతో మాట్లాడిన రేవంత్ రెడ్డి
పలు డిమాండ్లను పరిష్కరించాలంటూ బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు గత కొన్నిరోజులుగా ధర్నా చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు తెలంగాణ కాంగ్రెస్ మద్దతు పలికింది. కాగా, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పోలీసుల ఆంక్షలను ఛేదించుకుని ఇవాళ గోడదూకి బాసర ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లోకి ప్రవేశించారు. నిరసనలు తెలుపుతున్న విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు.
రేవంత్ రెడ్డి ట్రిపుల్ ఐటీలోకి ప్రవేశించిన విషయం గుర్తించిన పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ చేసి అక్కడ్నించి తరలించారు. కాగా, విద్యార్థుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. విద్యార్థులను కలిస్తే అక్రమంగా అరెస్ట్ చేశారని మండిపడ్డారు.
కాగా, పోలీసులను ఏమార్చి ట్రిపుల్ ఐటీలోకి ప్రవేశించే క్రమంలో రేవంత్ రెడ్డి కొంతదూరం ట్రాక్టర్ లో ప్రయాణించారు. ఆపై పొలాల్లో కాలినడకన ఐఐఐటీ వద్దకు చేరుకున్నారు.