సొంత పార్టీ వాళ్లే నాపై కుట్రలు చేస్తున్నారు… వాళ్ల అంతు చూస్తా: వైసీపీ కీలక నేత బాలినేని
- సొంత పార్టీ వాళ్లే వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారన్న బాలినేని
- వారితో టీడీపీ నేతలు టచ్‌లో ఉన్నారని ఆరోపణ
- తప్పు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని వెల్లడి
- శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటన
ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీలో పార్టీలోని అంతర్గతం సంక్షోభం డామేజ్ చేస్తుంది. ఇప్పటికి వివిధ జిల్లాల్లో ఉన్న పంచాయతీలో అధినేత సీఎం జగన్ కు ఇబ్బందులు తెచ్చిపెడుతుండగా తాజాగా జగన్ కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న బాలినేని శ్రీనివాస్ రెడ్డి పై పార్టీలోని వారే కుట్రలు చేస్తున్నారని బహిరంగంగానే విమర్శలు చేయడం జగన్ ను ఇరకాటంలో పట్టింది. మంత్రి వర్గ పునర్వ్యవస్తీకరణలో బాలినేని మంత్రి పదవి తిరిగి రాలేదు …అప్పుడే ఆయన అలక బూనారు . సీఎం జోక్యం తో తిరిగి ఆయన ఆక్టివ్ అయ్యారు . ఇప్పుడు కొత్త సమస్య వచ్చింది.
ఏపీలో అధికార పార్టీ వైసీపీలో కీలక నేత, పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సమీప బంధువుగా ఉన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తన సొంత పార్టీ నేతలపైనే సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై సొంత పార్టీ వాళ్లే కుట్రలకు పాల్పడుతున్నారని ఆయన సోమవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారని కూడా ఆయన వ్యాఖ్యానించారు. అలా సొంత పార్టీలో ఉంటూనే తనపై కుట్రలు చేస్తున్న వారెవరో తనకు తెలుసునని చెప్పిన బాలినేని… వాళ్ల సంగతి చూస్తానంటూ హెచ్చరికలు జారీ చేశారు.
తనను టార్గెట్ చేస్తున్న వారితో టీడీపీ నేతలు టచ్‌లో ఉన్నారని కూడా బాలినేని కీలక వ్యాఖ్యలు చేశారు. తాను తప్పు చేసినట్టు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఆయన ప్రకటించారు. అంతేకాకుండా రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని కూడా బాలినేని చెప్పారు. ఓ కేసు విషయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ విజ్ఞప్తితోనే కేసులు ఉపసంహరించుకున్నట్లు ఆయన వివరించారు.