కాంగ్రెస్‌లో చేరిన ఎర్ర శేఖర్.. కండువా కప్పి ఆహ్వానించిన రేవంత్ రెడ్డి!
- జడ్చర్ల నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఎర్ర శేఖర్
- టీడీపీతోనే రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన మాజీ ఎమ్మెల్యే
- ఎర్ర శేఖర్‌తో పాటు కాంగ్రెస్‌లో చేరిన దేవరకొండ నేత బీల్యా నాయక్
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే మరాటి చంద్రశేఖర్ అలియాస్ ఎర్ర శేఖర్ బీజేపీకి గుడ్ బై చెప్పి, కాంగ్రెస్ పార్టీలో చేరారు. గురువారం గాంధీ భవన్‌కు వచ్చిన ఎర్ర శేఖర్‌ను కాంగ్రెస్ పార్టీలోకి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సాదరంగా ఆహ్వానించారు. ఎర్ర శేఖర్‌తో పాటు దేవరకొండకు చెందిన మరో కీలక నేత బీల్యా నాయక్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు.
టీడీపీ ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించిన ఎర్ర శేఖర్, 1996, 1999 ఎన్నికల్లో జడ్చర్ల నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత 2009 ఎన్నికల్లోనూ ఆయన టీడీపీ అభ్యర్థిగానే జడ్చర్ల నుంచి మూడో సారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత తెలంగాణలో టీడీపీ ప్రాభవం తగ్గిపోయిన నేపథ్యంలో చాలా కాలం పాటు రాజకీయాలకు దూరంగానే ఉన్న ఎర్ర శేఖర్ కొద్దికాలం క్రితం బీజేపీలో చేరారు. తాజాగా ఆయన బీజేపీకి కూడా రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఇదిలా ఉంటే… ఎర్ర శేఖర్ పార్టీలో చేరిన సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాము సిద్ధంగానే ఉన్నామని ప్రకటించారు.