Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

చనిపోయినా.. ఇష్టమైన వారి గొంతు వినిపిస్తుంది…

చనిపోయినా.. ఇష్టమైన వారి గొంతు వినిపిస్తుంది.. కావాల్సిన వారి గొంతుతో కథలూ వినొచ్చు!

  • సరికొత్త సదుపాయాన్ని తీసుకువస్తున్న అమెజాన్
  • తన వాయిస్ అసిస్టెంట్ ‘అలెక్సా’ను ఈ దిశగా అభివృద్ధి చేస్తున్నట్టు వెల్లడి
  • త్వరలోనే అందుబాటులోకి తెస్తామని ఇటీవలే ప్రకటన
  • కోల్పోయిన ఆప్తుల వాణిని తిరిగి మన దగ్గరికి చేరుస్తామని ప్రకటన   

చిన్న పిల్లల నుంచి పండు వయసు వృద్ధుల వరకు దురదృష్టవశాత్తు కొన్ని సార్లు మన ఆప్తులను కోల్పోతుంటాం. ఎప్పుడూ వారినే గుర్తు చేసుకుంటుంటాం. ఎప్పుడైనా వారు మాట్లాడిన ఆడియోలనో, వీడియోలనో మళ్లీ మళ్లీ చూస్తూ, వింటూ గడిపేస్తుంటాం. కానీ వారు భౌతికంగా మన ముందు లేకున్నా మనతో మాట్లాడుతున్నట్టు ఉంటే.. మనకు కథలు చెప్తుంటే.. చాలా బాగుంటుంది కదూ.. అమెజాన్ ఈ సరికొత్త ఆలోచనతో ముందుకొచ్చింది. తమ వాయిస్ అసిస్టెంట్ ‘అలెక్సా’తో.. మీ ఆప్తులను తిరిగి మీ ముందుకు తెస్తామని ప్రకటించింది. అమెరికాలోని లాస్‌వెగాస్‌లో ఇటీవల జరిగిన వార్షిక సదస్సులో ఈ వివరాలను వెల్లడించింది.

కృత్రిమ మేధ సాయంతో..
అమెజాన్ అలెక్సా కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) సాయంతో పనిచేస్తుంది. మనం మాట్లాడే మాటల్లోని పదాలను గుర్తించి… అందుకు తగినట్టుగా స్పందిస్తుంది. మన ఇంట్లో ఇంటర్నెట్ సాయంతో అనుసంధానమై ఉన్న పరికరాలను నియంత్రిస్తుంది. ఇంటర్నెట్ నుంచి వార్తలను, కథలను చదివి వినిపిస్తుంది. ఇప్పుడీ కృత్రిమ మేధనే మరింతగా అభివృద్ధి చేసి.. నచ్చిన గొంతులో మాట్లాడేలా రూపొందిస్తున్నట్టు అమెజాన్ ఇటీవల ప్రకటించింది.

కేవలం ఒక నిమిషం ఆడియో ఉంటే చాలు..
ఎవరిదైనా ఇప్పటికే రికార్డు చేసి ఉన్న వాయిస్ (గొంతు)ను అలెక్సాకు అందిస్తే.. అలెక్సా దానిని గ్రహించి, దాదాపుగా అదే వాయిస్ లో తిరిగి మాట్లాడేలా అభివృద్ధి చేసినట్టు అమెజాన్ ఇంజనీర్లు చెప్తున్నారు. అంతేకాదు మనం ఇచ్చిన ఆడియోలోని వాయిస్ తోనే మనకు కావాల్సిన వివరాలను చెప్తుంది. కథలను చదివి వినిపిస్తుంది. మనం కోల్పోయిన ఆప్తులెవరి గొంతునైనా అలెక్సాకు వినిపిస్తే.. ఇక వారి వాయిస్ మనకు నిత్యం వినిపిస్తుంది.

బాలుడికి చనిపోయిన నానమ్మ గొంతుతో కథ చెప్పించి..
వాయిస్‌ అసిస్టెంట్‌ కు సంబంధించిన వీడియోను అలెక్సా కృత్రిమ మేధ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, శాస్త్రవేత్త రోహిత్‌ ప్రసాద్‌ ప్రదర్శించారు. ఆ వీడియోలో ఓ పదేళ్ల కుర్రాడు అమెజాన్‌ డివైజ్ తో.. ‘అలెక్సా.. మా నానమ్మ గొంతుతో కథ వినిపించవా?’ అని అడుగుతాడు. అప్పటికే నానమ్మ వాయిస్ ను అలెక్సాకు వినిపించి ఉండటంతో.. అలెక్సా వెంటనే నానమ్మ వాయిస్ లో అడిగిన కథను వినిపిస్తుంది.

ఈ వీడియో చూసి అంతా ఆశ్చర్యపోయారు. ఎప్పుడో చనిపోయిన నానమ్మ గొంతులో కథ వింటూ ఆ కుర్రాడు ఎంతో సంతోషించడం ఆకట్టుకుంది. త్వరలోనే ‘అలెక్సా’లో ఈ సరికొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెస్తామని అమెజాన్ ప్రకటించింది. అయితే ఎప్పటిలోగా అన్నది కచ్చితంగా వెల్లడించలేదు.

Amazons Alexa may soon be able to read you stories in the voice of a dead relative

Related posts

మీడియా మిత్రులారా, దయచేసి కేసీఆర్ ట్రాప్ లో పడకండి: షర్మిల!

Drukpadam

అమరరాజా తరలింపు వార్తలపై స్పందించిన సీపీఐ నారాయణ పరిశ్రమను ప్రభుత్వమే వెళ్లగొడుతోంది!

Drukpadam

వచ్చే ఎన్నికల్లో నాకు టికెట్ రాకపోవచ్చు: మాజీ మంత్రి బాలినేని!

Drukpadam

Leave a Comment