ఉద్ధవ్ థాకరే సంచలన నిర్ణయం …ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము కు మద్దతు
-మా పార్టీ అల్ప బుద్ధి కలిగిన పార్టీ కాదు కాబట్టే విశాల దృక్పథంతో ఆమెకు మద్దతు ఇస్తున్నాం”
-పార్టీ ఎంపీలతో శివసేన అధినేత సమావేశం
-19 మందిలో 12 మంది ముర్ముకే మద్దతు
-అధికారిక ప్రకటన చేసిన థాకరే
-విశాల దృక్పథంతో నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడి
నిన్నగాక మొన్న ఆయన కుర్చీని బలవంతంగా లాగి వేరేవారిని గద్దెనెక్కించారు. అయినప్పటికీ పార్టీ ఎంపీ ల అభిప్రాయం అనండి లేక గిరిజన మహిళకు వచ్చిన అవకాశం అనండి చివరకు ఉద్దవ్ థాకరే ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు ప్రకటించారు . ఈ సందర్భంగా ప్రస్తుత పరిస్థితుల్లో మద్దతు ఇవ్వకూడదు కానీ విశాల దృక్పధంతో మద్దతు ఇవ్వాలని నిర్ణయించామని అన్నారు .
సొంత పార్టీ ఎంపీల ఒత్తిడికి శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే తలొగ్గినట్టు కనిపిస్తోంది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకే శివసేన మద్దతు అని ఉద్ధవ్ థాకరే అధికారికంగా ప్రకటించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలన్న అంశంపై శివసేన ఎంపీలు ఉద్ధవ్ థాకరే అధ్యక్షతన సమామవేశమయ్యారు. 19 మంది ఎంపీల్లో 12 మంది ద్రౌపది ముర్ముకే మద్దతు పలకాలన్న వాదన వినిపించడంతో ఉద్ధవ్ థాకరే నిస్సహాయుడయ్యారు. ఈ నేపథ్యంలోనే, ముర్ముకు మద్దతు ఇస్తున్నట్టు వెల్లడించారు.
అయితే, తమ నిర్ణయం వెనుక ఎవరి బలవంతం లేదని థాకరే స్పష్టం చేశారు. ఎంపీలతో సమావేశంలో తనపై ఎవరూ ఒత్తిడి తేలేదని అన్నారు. ఓ గిరిజన మహిళ రాష్ట్రపతి అయ్యేందుకు మొదటిసారిగా అవకాశం వచ్చిందని మా పార్టీలోని కొందరు గిరిజన నేతలు చెప్పడంతో ఈ నిర్ణయం తీసుకున్నాం అని వివరించారు.
“ప్రస్తుత రాజకీయ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే మేం ముర్ముకు మద్దతు ఇవ్వకూడదు… కానీ మా పార్టీ అల్ప బుద్ధి కలిగిన పార్టీ కాదు కాబట్టే విశాల దృక్పథంతో ఆమెకు మద్దతు ఇస్తున్నాం” అని థాకరే స్పష్టం చేశారు.