తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ఇలా!… అక్కడ ఇద్దరు, ఇక్కడ ఇద్దరు ఓటింగుకి దూరం!
ఏపీలో ఇద్దరు ..తెలంగాణాలో ఇద్దరు రాష్ట్రపతి ఓటింగ్ కు దూరం …
అందులో ఇద్దరు టీడీపీ …ఇద్దరు టీఆర్ యస్ ఎమ్మెల్యేలే
- ఏపీలో ఓటు హక్కు వినియోగించుకున్న వారు 173 మంది
- తెలంగాణలో ఓటేసిన 117 మంది ఎమ్మెల్యేలు
- పీపీఈ కిట్‌లో వచ్చి ఓటేసిన ఏపీ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్
- కరోనా కారణంగా ఓటు వేయని తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్
భారత నూతన రాష్ట్రపతి ఎన్నిక కోసం జరిగిన పోలింగ్ సోమవారం సాయంత్రం 5 గంటలకు ముగిసిన సంగతి తెలిసిందే. ఈ పోలింగ్‌లో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంపీలతో పాటు మెజారిటీ ఎమ్మెల్యేలంతా ఉత్సాహంగా హాజరయ్యారు. ఏపీలో ఇద్దరు ఎమ్మెల్యేలు పోలింగ్ కు గైర్హాజరు కాగా… తెలంగాణలోనూ ఇద్దరు ఎమ్మెల్యేలు ఓట్లు వేయలేదు.
ఏపీ విషయానికి వస్తే… నామినేటెడ్ ఎమ్మెల్యేను మినహాయిస్తే మొత్తం 175 ఓట్లు ఉన్నాయి. ఇందులో వైసీపీ 151, టీడీపీకి 23, జనసేనకు 1 ఓటు ఉంది. వైసీపీ ఎమ్మెల్యేల్లో 150 మంది ఏపీ అసెంబ్లీలోనే ఓటు వేయగా… కందుకూరు ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి ఎన్నికల సంఘం అనుమతితో తెలంగాణ అసెంబ్లీలో ఓటు వేశారు.
ఇక టీడీపీ తరఫున 23 ఓట్లు ఉండగా… 21 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ, రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి విదేశాల్లో ఉన్న కారణంగా ఓటు వేయలేదు. జనసేన తరఫున గెలిచిన రాపాక వరప్రసాద్ ఏపీ అసెంబ్లీలోనే తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. కరోనా కారణంగా గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ పీపీఈ కిట్‌లో వచ్చి ఓటు వేశారు.
ఇక తెలంగాణ విషయానికి వస్తే… తెలంగాణ అసెంబ్లీలో మొత్తం 119 ఓట్లు ఉండగా… సోమవారం నాటి పోలింగ్ లో 117 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. అధికార పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కు వినియోగించుకోలేదు. వీరిలో మంత్రి గంగుల కమలాకర్ కరోనా కారణంగా పోలింగ్‌కు దూరంగా ఉండిపోయారు. ఇక చెన్నూరు నుంచి గెలిచిన ఎమ్మెల్యే విద్యాసాగర్ విదేశాల్లో ఉన్న కారణంగా పోలింగ్‌కు హాజరు కాలేకపోయారు. పోలింగ్ ముగిసిన అనంతరం ఇరు రాష్ట్రాల అసెంబ్లీల్లోనే బ్యాలెట్ బాక్సులను భద్రపరిచారు. మంగళవారం విమానం ద్వారా బ్యాలెట్ బాక్సులు ఢిల్లీకి తరలనున్నాయి.